టాలీవుడ్ లో లుకలుకలు లేవు. అందరూ ఒక్కటే అని ఇంతకాలం పాట పాడారు. ఎపుడైతే మా ఎన్నికలు ముందుకు వచ్చాయో లోలోపల ముసుగులు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఎవరికి వారుగా వేరుగా కనిపించడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు కూడా లేదనే చెప్పాలి. టాలీవుడ్ లో పెద్దరికాలు పెద్దలు అంటూ ఎవరూ లేరని మంచు మోహన్ బాబు ఒక చానల్ లో కుండబద్ధలు కొట్టాక ముందూ తరువాత జరిగినవన్నీ అలాగే ఉంటూ వచ్చాయి. నిజానికి మోహన్ బాబు అలా అన్నారని కాదు కానీ పెద్దరికాలు ఉంటే మా ఎన్నికలు ఎందుకంత హాట్ హాట్ గా సాగుతాయి. ప్రజాస్వామ్యంలో ఎంపిక కంటే ఎన్నికనే ఎవరైనా ఇష్టపడతారు. అయితే అది జరిగిన తీరు మాత్రమే ఇపుడు టాలీవుడ్ లోపలా బయటా కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపుతోంది.
ఇక తాను అందరివాడిని అని మెగాస్టార్ చిరంజీవి ఎంత అనుకున్నా ఆయన కొందరివాడే నని మా ఎన్నికలు నిరూపించాయా అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి చిరంజీవి ఎపుడూ ఒక వర్గం కొమ్ము కాయలేదు ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా స్వాగతించేవారే. కానీ మా ఎన్నికల విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చిరంజీవి మద్దతు ఇచ్చారు అంటూ జరిగిన విపరీత ప్రచారం దాని మీద మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన పక్కా క్లారిటీతో చిరంజీవి వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్లుగానే మా ఎన్నికలు జరిగాయి. చివరికి మంచి విష్ణు ప్యానల్ గెలవడంతో మెగాస్టార్ బలపరచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడింది అన్న ప్రచారమే ఈ రోజుకీ సాగుతోంది. మరో వైపు చూస్తే ప్రకాష్ రాజ్ ఓటమి తరువాత నాగబాబు మా సభ్యత్వానికి చేసిన రాజీనామాతో మరింతగా రచ్చ ముదిరింది.
మొత్తానికి గత రెండేళ్ళుగా అనేక పరిణామాలు జరిగాయి. వాటికి కొనసాగింపుగానే మంచు విష్ణు ప్యానల్ గెలిచిందా అన్న మాటా ఉంది. ఇక విష్ణు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ రాలేదు. దాంతో మంచు విష్ణు పిలిచారా లేదా అన్న దాని మీద కూడా డిస్కషన్స్ సాగుతున్నాయి. ఇవన్నీ అలా ఉంచితే మా ఎన్నికల తరువాత నిట్ట నిలువున చీలిక అయితే టాలీవుడ్ లో వచ్చింది అన్నదానికి నిదర్శనమే ఈ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ లేకపోవడం అంటున్నారు.
ఇక చిరంజీవి టాలీవుడ్ పెద్దగా ఇప్పటిదాకా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అపుడు మంచు మోహన్ బాబు ఎక్కడా కనిపించలేదు. ఇపుడు విష్ణు ప్రమాణ స్వీకారానికి వచ్చిన తెలంగాణా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మోహన్ బాబును ప్రశంసలతో ముంచెత్తారు. తామిద్దరం అన్నదమ్ములమని కూడా చెప్పుకున్నారు. విష్ణు ది మంచి నాయకత్వం అన్నారు. మొత్తానికి తెలంగాణా సర్కార్ అండదండలు మా నూతన టీమ్ కి ఉంటాయని చెప్పేశారు. దాంతో ఇపుడు విష్ణు ప్యానల్ కి కొండంత ధైర్యం వచ్చేసింది. ఇదే తలసానితో గతంలో మెగాస్టార్ ఇతర నటులూ భేటీ అయ్యారు. ఇపుడు మోహన్ బాబు పెద్దగా అవతరించబోతున్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది.
ఈ మొత్తం పరిణామాలు చూసుకుంటే ఇకపైన మెగాస్టార్ కూడా కొందరివాడుగానే బయటకు రావాలేమో. ఆయన కూడా పై రెండు వర్గాలలో ఏదో వర్గానికి కొమ్ము కాయాలేమో. లేకపోతే ఈ రెండు వర్గాలు బాహాటంగా ఇలా రచ్చ చేసుకున్నాక కూడా కలవలేనంత దూరాలకు వెళ్ళిపోయాక కూడా ఆయన సైలెంట్ గా ఉంటే ఇక లాభం లేదేమో అనిపించకమానదు. ఇప్పటికైనా మెగాస్టార్ కలుగచేసుకుని రెండు వర్గాలను కలిపితే అందరివాడుగా ఉంటారేమో. లేకపోతే ఆయన్ని కొందరి వాడుగా అంటకట్టి ఆయన లేకుండానే మా లో చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయేందుకు కూడా రెండవ వర్గం రెడీ అవుతోంది అనుకోవాలి.
Recent Random Post: