మలయాళ ‘ప్రేమమ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ను ఫిదా చేసింది. ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అందం – అభినయం – అదృష్టం కలబోసిన సాయి పల్లవికి డ్యాన్స్ కూడా మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
‘ఫిదా’ సినిమాలో ‘వచ్చిండే’.. ‘మారి 2’ మూవీలో ‘రౌడీ బేబీ’.. రీసెంటుగా వచ్చిన ‘లవ్ స్టోరి’ చిత్రంలో ‘సారంగ దరియా’ పాటలు సాయి పల్లవి డ్యాన్స్ కు ఉదాహరణలు. ఈ బ్యూటీ స్టెప్పులు వేసిన ఈ సాంగ్స్.. మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ చేశాయి. అందుకే ఆమెను డ్యాన్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా సినీ అభిమానులు పేర్కొంటారు. అయితే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో సాయి పల్లవి మరోసారి తన డ్యాన్సులతో మెస్మరైజ్ చేయబోతోందని టాక్ వినిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ”శ్యామ్ సింగ రాయ్”. ఈ సినిమాలో కృతి శెట్టి – మడోనా సెబాస్టియన్లతో పాటుగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో పల్లవి చేసిన ఓ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలబోతోందని తెలుస్తోంది.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ చిత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఓ పాట ఉందట. క్లాసికల్ డ్యాన్స్ టచ్ తో సాగే ఈ సాంగ్ లో సాయిపల్లవి డాన్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. స్వతహాగా డ్యాన్సర్ అయిన పల్లవి.. ఇందులో కాళీ మాత గెటప్ లో అలరించబోతోందని అంటున్నారు. ఇప్పటికే సాయి పల్లవి త్రిశూలం పట్టుకుని ఉన్న ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి స్పందన తెచ్చుకుంది. మరి సినిమాలోని ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
”శ్యామ్ సింగ రాయ్” చిత్రాన్ని నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది.
Recent Random Post: