నా పేరును నేనే మార్చుకున్నాను: అనుష్క

అనుష్క .. తెలుగు తెరపై అందాలు వెదజల్లే పాలపుంత. ఏ శిల్పకారుడు చెక్కలేని సౌందర్యం .. ఏ చిత్రకారుడు గీయలేని లావణ్యం ఆమె సొంతం. గడుసైన ఆమె కళ్లు గారడీ చేస్తాయి .. కొంటె చూపులు గమ్మత్తు చేస్తాయి. తెరపైకి అనుష్క వస్తుంటే .. మబ్బుల గుంపుల మధ్యలో నుంచి చందమామ వస్తున్నట్టుగా ఉంటుంది. పండుగలన్నీ ఒక్కసారిగా పరిగెత్తుకు వస్తున్నట్టుగా ఉంటుంది. తెరపై అనుష్కను మొదటిసారి చూసిన కుర్రాళ్లు ఇలాంటి అమ్మాయి ఊరికొక్కరున్నా ఎంత బాగుండునో కదా అనుకుని ఉసూరుమన్నారు. అంతగా యూత్ హృదయాలను హోల్ సేల్ గా దోచేసిన అనుష్క పుట్టినరోజు నేడు.

చాలామంది ఆమె విషయంలో ఒక మాట అనుకుంటూ ఉంటారు. ఆమె అసలు పేరు అనుష్క .. ముద్దుపేరు స్వీటీ అనే అనుకుంటూ ఉంటారు. కానీ ఆమె అసలు పేరే స్వీటీ అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగకమానదు. సాధారణంగా రాజమౌళితో సహా చాలామంది అనుష్కను ఆయా సినిమా వేదికలపై ‘స్వీటీ’ అనే పిలుస్తూ ఉంటారు. దాంతో అంతా అది ఆమె నిక్ నేమ్ అనుకున్నారు .. ఆమెతో ఉన్న చనువు కారణంగా అలా పిలుస్తున్నారని భావించారు. కానీ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ తన అసలుపేరే స్వీటీ అని చెప్పుకొచ్చారు.

“నేను ఇంటర్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు నా పేరు స్వీటీ అని రాస్తే .. ‘ముద్దు పేరు బాగుంది .. అసలు పేరు రాయమ్మా’ అని అక్కడున్నవారు అనడంతో నాకు ఎలాగో అనిపించింది. ఇక సినిమాల్లోకి వచ్చాక సెట్లో నన్ను స్వీటీ అని పిలవడానికి కొంతమంది ఇబ్బంది పడటంతో నేను నా పేరును మార్చుకోవాలని అనుకున్నాను. బాగా ఆలోచించి అనుష్క అనే పేరును నేనే పెట్టుకున్నాను. ఇలా నా పేరును నేనే పెట్టుకునే అవకాశం నాకే దక్కింది” అంటూ ఆమె నవ్వేశారు. “అయితే అనుష్క అనే పేరును నేను పెట్టుకున్నప్పటికీ ఆ పేరుతో ఎవరైనా పిలిస్తే పలకడమనేది ఏడాదికి గాని నాకు అలవాటు కాలేదు” అని ఆమె అన్నారు.

అనుష్క కెరియర్ ను పరిశీలిస్తే తెలుగులో ఆమె చాలామంది దర్శకులతో పనిచేశారు. వాళ్లలో ఆమె కెరియర్ ను మలుపు తిప్పిన దర్శకులుగా పూరి .. రాజమౌళి .. కోడి రామకృష్ణ .. గుణశేఖర్ కనిపిస్తారు. అనుష్కను పరిచయం చేసిన ఘనత పూరి ఖాతాలోకి వెళుతుంది. ‘విక్రమార్కుడు’తో తొలి హిట్ ను ఇచ్చిన రాజమౌళి ‘బాహుబలి’తో ఆమెను తిరుగులేని స్టార్ ను చేశారు. ఇక నాయిక ప్రధానమైన పాత్రలలో ఆమె తరువాతనే ఎవరైనా అనే బలమైన అభిప్రాయాన్ని ‘అరుంధతి’ కలిగించింది .. అందుకు కారకులు కోడి రామకృష్ణ. అనుష్క చారిత్రక పాత్రలలోను చక్కగా ఒదిగిపోతుందనే విషయాన్ని ‘రుద్రమదేవి’ సినిమాతో గుణశేఖర్ నిరూపించారు. ఇలా అనుష్క అంచలంచెలుగా ఎదిగారు .. ఆమె ఈ తరానికి దొరికిన వరమని అందరితో అనిపించారు.


Recent Random Post: