రజినీ సర్ మీరూ ఇలాగైతే ఎలా చెప్పండి!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తే సినిమా ఇటీవల దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు లో పెద్దన్న అంటూ ఈ సినిమాను విడుదల చేశారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

భారీ అంచనాలున్న ఈ సినిమాను తమిళనాట పెద్ద ఎత్తున బిజినెస్ చేశారు. కాని తెలుగు డబ్బింగ్ రైట్స్ మాత్రం నామమాత్రపు రేటుకు అమ్ముడు పోయాయి. సినిమా విడుదల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దన్నకు పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తాయని ఆశించారు.

కాని బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఈ సినిమా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్దన్న సినిమా బయ్యర్లకు రక్త కన్నీరు మిగిల్చింది. ఇలాంటి సినిమా ను రజినీకాంత్ సూపర్ హిట్ అంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏంటీ అంటే.. అన్నాత్తే సినిమా విడుదలకు ముందు రజినీకాంత్ అనారోగ్య సమస్య కారణంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. విడుదల తర్వాత సినిమా గురించి రజినీకాంత్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ నాకు శివ కమర్షియల్ హిట్ ఇస్తానంటూ హామీ ఇచ్చాడు. నాకు ఇచ్చిన ప్రామీస్ ను శివ నిలబెట్టుకున్నాడు.

ఇలాంటి కమర్షియల్ సక్సెస్ ను చాలా కాలం తర్వాత చూశాను అన్నట్లుగా రజినీకాంత్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్నాత్తే కు తమిళనాట రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి. కాని లాంగ్ రన్ లో సినిమా భారీ వసూళ్లను మాత్రం నమోదు చేయలేక పోయింది. ఓపెనింగ్స్ విషయంలో కూడా సినిమా పీఆర్ టీమ్ మీడియాను మ్యానేజ్ చేసి భారీ వసూళ్లను ప్రచురించినట్లుగా విమర్శలు ఉన్నాయి.

ఆ విషయాలను పక్కన పెడితే రివ్యూలు కూడా గొప్పగా ఏమీ రాలేదు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు సినిమాను ఏకి పారేశాయి. అయినా కూడా రజినీకాంత్ దర్శకుడు శివకు కృతజ్ఞతలు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నెట్టింట సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. రజినీకాంత్ సర్ మీరు ఒక సీనియర్ స్టార్ హీరో. సక్సెస్ మరియు ప్లాప్ లను ఒకేలా చూసేంతటి అనుభవం మీకు ఉన్నది అనడంలో సందేహం లేదు.

కాని అన్నాత్తే సినిమా ఫలితం విషయంలో తప్పుడు సమాచారంను అభిమానులకు మరియు ప్రేక్షకులకు తెలియజేసేందుకు మీరు ప్రయత్నించడం సబబు కాదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న హీరోలు.. కొత్త హీరోల సినిమాలకు ఇలా తప్పుడు ప్రచారాలు చేయించుకుంటారు.. మీ పీఆర్ టీమ్ తప్పుడు కలెక్షన్స్ చెప్తే ఏమో కాని స్వయంగా మీరు సినిమా సూపర్ హిట్ అంటూ దర్శకుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రజినీకాంత్ అభిమానులు మాత్రం ఆయన్ను సపోర్ట్ చేస్తున్నారు. 200 కోట్ల వసూళ్లు నమోదు చేసింది కనుక ఖచ్చితంగా కమర్షియల్ హిట్ అనడంలో సందేహం లేదు.. అందుకు దర్శకుడు శివకు రజినీ సర్ థ్యాంక్స్ చెప్పడం అభినందనీయం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పై విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి పెద్దన్న ప్లాప్ అని తేలిపోయింది కాని.. అన్నాత్తే ఫలితం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.


Recent Random Post: