‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం ”పుష్ప”. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరెక్కనున్న ఈ సినిమాలో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. కూలీగా లారీ డ్రైవర్ గా స్మగ్లర్ గా మూడు కోణాల్లో ఆయన పాత్ర ఉండబోతోంది. సరికొత్త అవతారంలోకి తనను తాను మలచుకోడానికి బన్నీ అంకితభావంతో తీవ్రంగా శ్రమించాడని చిత్ర బృందం చెబుతోంది.
పుష్పరాజ్ పాత్రకి తగ్గట్టుగా మారేందుకు అల్లు అర్జున్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మేకప్ వేయడానికి రెండు గంటల సమయం పడితే.. దాన్ని తొలగించడానికి అర గంటపైనే పట్టిందని తెలుస్తోంది. అంతేకాదు నిత్యం ఆ క్యారెక్టర్ లో ఉంటూ మ్యానరిజమ్స్ ని పాటిస్తూ ఏడాదికి పైగా కష్టపడ్డారని మేకర్స్ తెలిపారు. సినిమా కోసం ఇంతలా బన్నీ పడిన శ్రమకు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు నిర్మాత నట్టి కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నట్టి కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ కి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నానని.. ‘పుష్ప’ కోసం రాత్రి పగలు కష్టపడి ప్రాణం పెట్టి చేశారని అన్నారు. అడవుల్లో స్మగ్లింగ్ చేసే క్లిష్టమైన పుష్పరాజ్ పాత్రను ఒప్పుకొని.. రెండు సంవత్సరాలు షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదని.. అలాంటి పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని చేసినందుకు అల్లు అర్జున్ ని అభినందిస్తున్నాని తెలిపారు.
డైరెక్టర్ సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ – బన్నీ మేనమామలు ముత్యంశెట్టి బ్రదర్స్ ఎన్నో వ్యయప్రయాసలు పడి ‘పుష్ప’ సినిమా చేశారు. ఇది 100 శాతం సూపర్ హిట్ సినిమా. ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం బీభత్సంగా ఉంటాయి అని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ‘గంగోత్రి’ సినిమా నుంచి బన్నీ ప్రతీ దాంట్లో వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు.
ఫస్ట్ సినిమాకు మాత్రమే అల్లు అరవింద్ కొడుకునని.. చిరంజీవి మేనల్లుడిని అని చెప్పుకున్నారే తప్ప.. రెండో సినిమా నుంచి అల్లు అర్జున్ అని తన పేరు మీదనే ఎదుగుతూ వచ్చాడు అని నిర్మాత తెలిపారు. ‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్ అడవుల్లో పడిన కష్టానికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని.. ‘రంగస్థలం’ సినిమా స్థాయిలో ‘పుష్ప’ హిట్ అవుతుందని ఆయన అన్నారు.
‘పుష్ప’ అని టైటిల్ పెట్టినప్పుడు ఇదేమి టైటిల్ అని అనుకున్నారు. కానీ తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ సినిమా గురించి.. అల్లు అర్జున్ మరియు సాంగ్స్ గురించి మాట్లాడుతున్నారు. సాధారణంగా నేను ఎవరినీ పొగడను. కానీ మంచి అయితే మంచి చెప్పాలి. ఇప్పుడు ‘పుష్ప’ లో చిత్ర బృందం కష్టం కనిపిస్తోంది అని యూనిట్ మొత్తానికి నట్టి కుమార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కాగా సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. ఫాహాద్ ఫాజిల్ – సునీల్ – అనసూయ – అజయ్ ఘోష్ – రావు రమేష్ – అజయ్ – ధనుంజయ – అజయ్ – శత్రు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ‘పుష్ప: ది రైజ్’ పాన్ ఇండియా స్థాయిలో రేపు శుక్రవారం (డిసెంబర్ 17) విడుదల కాబోతోంది.
Recent Random Post: