పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను అభిమానించే అభిమానుల కోపం కట్టలు తెగుతోంది. తాము అభిమానించే హీరోను దేవుడిలా.. ఆయన్ను అభిమానించటమే ఒక జపంగా భావించే వారికి కొదవ లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేని ఇమేజ్ ఆయన సొంతం. పవనిజం అంటూ ఆయన అభిమానులు ఏకంగా ‘ఇజం’ ఉందని చెప్పేసుకోవటం కనిపిస్తోంది. అలాంటి పవన్ ను తమ అవసరానికి వాడేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తవుతోంది. సినిమా ఇండస్ట్రీ కోసం నోరు తెరిచి మాట్లాడితే.. ఒకరిద్దరు తప్పించి.. తమకుతాము మొనగాళ్లుగా ఫీలయ్యే వారు సైతం నోరు విప్పలేదు.
అంతేనా.. అరే.. మన ఇండస్ట్రీకి చెందినోడ్ని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. విడి సమయాల్లో ఎటూ అండగా నిలవం. కనీసం.. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడినప్పుడైనా ఆయన వెనుక ఉందాం. ఆయన వాదనకు నైతిక మద్దతు ఇద్దామన్న సోయి లేకపోగా.. ఇండస్ట్రీకి చెందిన వారే ఆయన వ్యక్తిగత జీవితాన్ని దారుణంగా బద్నాం చేసిన వైనాన్ని చూశారు. పవన్ కు అండగా ఏ ఒక్కరు నిలవరు కానీ.. తమ అవసరాల కోసం పవన్ నిలవాలనుకోవటం కనిపిస్తుంది.
ఈసారి సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్.. ఆ తర్వాత బీమ్లా నాయక్.. సంక్రాంతికి రాధేశ్యామ్ సినిమాలు విడుదలవుతాయని ముందే కన్ఫర్మ్ చేశారు. రెండు పాన్ ఇండియా మూవీల మధ్యలో ఉన్న పవన్ భీమ్లా నాయక్ మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. భీమ్లా నాయక్ కానీ ఎంట్రీ ఇస్తే.. తమ రెండు సినిమాలకు దెబ్బే అన్న విషయాన్ని గుర్తించి.. విడుదలకు దగ్గరకు వచ్చేసరికి.. ఇండస్ట్రీ అంతా ఏకమై పవన్ ను ఒప్పించటం తెలిసిందే.
ఈ వైనాన్ని మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. పవన్ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అసలు ఇండస్ట్రీ గురించి పవన్ ఎందుకు ఆలోచించాలని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీ కోసం గొంతు చించుకొని ప్రభుత్వాన్ని దమ్ముగా ప్రశ్నిస్తే.. ఒక్కడంటే ఒక్కడు ముందుకు రాకపోగా.. ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడితే తోలుబొమ్మలాట చూసినట్లు చూశారే తప్పించి.. ఇదెక్కడి పద్దతి అని ప్రశ్నించినోళ్లు లేరు. అలాంటప్పుడు ఎవరి సినిమా వారిదే. ఎవరి దమ్ము వారిదే అన్నట్లుగా ఉండాలే తప్పించి.. తెర వెనుకాల ఈ పంచాయితీ ఏమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తోపు సినిమాలుగా చెప్పుకునే ఆర్ఆర్ఆర్… రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాల మధ్యలో భీమ్లా నాయక్ వస్తున్నందున ఆ సినిమా నిర్మాతలు ఆలోచించాలే కానీ.. రెండు పాన్ ఇండియా మూవీలు ఇలా చేయటం ఏమిటంటూ మండిపడుతున్నారు. అవసరం వస్తే చాలు.. ఎమోషన్ ట్యాగ్ తీసి పవన్ ను వాడేసే వారు.. ఆయనకు ఏ రోజైనా అండగా నిలిచారా? అన్న సూటి ప్రశ్న ఎదురవుతోంది.
అండగా నిలవటం తర్వాత.. కనీసం నైతిక మద్దతును ఎప్పుడైనా ప్రకటించారా? అంటే అది కూడా లేదు. అలాంటప్పుడు సంక్రాంతి రేసు నుంచి భీమ్లానాయక్ ఎందుకు తప్పు కోవాలి? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ అభిమానుల కోపం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. పవన్ అభిమానుల కోణం నుంచి చూసినప్పుడు.. వారి వాదనలో పస ఉందన్న అభిప్రాయాన్ని సినీ పరిశ్రమకు చెందిన కొందరు ఆఫ్ ద రికార్డుగా ఒప్పుకోవటం గమనార్హం.
Recent Random Post: