పాన్ ఇండియా సినిమాలపై నాని కీలక వ్యాఖ్యలు..!

ఇటీవల అమెరికా కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘పాన్ ఇండియా’. ప్రతి ఒక్క దర్శక హీరో పాన్ ఇండియా చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారు. నేషనల్ వైడ్ ఆడియన్స్ ను మెప్పించడమే లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు.

ఇప్పటికే ప్రభాస్ – అల్లు అర్జున్ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ వంటి టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. ఈ క్రమంలో అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అయిపోయింది.

తాజాగా ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేచురల్ స్టార్ నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా మార్కెట్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన సినిమాని మనమే పాన్ ఇండియా అనుకుంటే సరిపోదని.. కంటెంట్ ను బట్టి ప్రేక్షకులే ఆ మాట చెప్పాలని అభిప్రాయపడ్డారు.

నాని మాట్లాడుతూ.. ”మన సినిమాని మనమే పాన్ ఇండియా సినిమా అనుకోకూడదని నా అభిప్రాయం. ప్రేక్షకులు స్వీకరిస్తేనే అది పాన్ ఇండియా సినిమా. కథ బాగుండి.. మంచిగా తెరకెక్కించాలి. అది ప్రజలకి నచ్చాలి. అంతే కానీ యూనివర్సల్ కథలతో తీస్తే అది పాన్ ఇండియా సినిమా అయిపోదు” అని అన్నారు.

”ఉదాహరణగా ‘పుష్ప’ సినిమానే తీసుకుంటే ఇక్కడ మన నల్లమల అడవుల్లో జరిగే కథ. దానికీ బాలీవుడ్ కి ఏమైనా సంబంధం ఉందా? కానీ మంచి సినిమా.. బాగా తెరకెక్కించారు కాబట్టే అక్కడి ప్రేక్షకులు కూడా ఆదరించడంతో అది పాన్ ఇండియా సినిమా అయింది. అలా ఎవరైనా కథపై దృష్టి పెట్టాలి కానీ.. పోస్టర్స్ పై పాన్ ఇండియా అని రాసుకోకూడదు”

”ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి గోల్డెన్ దశ నడుస్తోంది. సినిమా బాగుంటే ప్రాంతాలు భాషలతో సంబంధం లేకుండా విజయం సాధిస్తున్నాయి. మన తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినిమా పరిశ్రమకే ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి” అని నాని చెప్పుకొచ్చారు.

ఇకపోతే నాని నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 10వ తేదీన తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇదే క్రమంలో ‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయనున్నారు నాని. దీని కోసం తన కెరీర్ లోనే తొలిసారిగా రా అండ్ రస్టిక్ లుక్ లోకి మారిపోయాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.

‘దసరా’ మూవీని తెలుగుతో పాటుగా హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్స్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 25 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మరి ఈ ప్రాజెక్ట్ తో నాని పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుంటారేమో చూడాలి.


Recent Random Post: