రష్యా వంతెనను పేల్చేసిన ఉక్రెయిన్.. ఇక యుద్దం బీభత్సమే

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఓవైపు ఆక్రమిత ప్రాంతాల్లో రెఫరెండం చేపడుతూ.. అవసరమైతే వ్యూహాత్మక అణ్వాయుధాలు వాడుతామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేస్తుండగా.. ఉక్రెయిన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది. పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాల అండతో ఉక్రెయిన్ రష్యాను చికాకుపెడుతోంది. ఉదాహరణకు జాపోరిజ్జియా ప్రాంతాన్ని తమలో కలిపేసుకున్నట్లు రష్యా ప్రకటించినా.. ప్రధాన నగరం జాపోరిజ్జియా మాత్రం ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉంది.

ఇటీవల కీలకమైన లీమన్ నగరాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ నుంచి రష్యా 2014లో ఆక్రమించిన క్రిమియా ప్రాంతంలోని ఓ కీలక వంతెన భారీ పేలుడులో తీవ్రంగా ధ్వంసమైంది. ఈ పని ఉక్రెయిన్ దళాలు చేసినదే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అత్యంత కీలక వంతెన అది..

క్రిమియా.. 2014లో ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించిన ప్రాంతం. ఈ క్రిమియాను రష్యాతో అనుసంధానం చేస్తుంది కెర్చ్ అనే రైలు-రోడ్డు వంతెన. దీనిపై శనివారం భారీ పేలుడు జరిగింది. ఓ ట్రక్కు అకస్మాత్తుగా పేలిపోవడంతో వంతెన చెల్లాచెదురైంది. దీంతో క్రిమియాకు వెళ్తోన్న ఏడు ఆయిల్ ట్యాంకర్లకు మంటలు అంటుకున్నాయి. పెద్దఎత్తున అగ్నిప్రమాదం జరిగి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. వాటి తీవ్రతకు వంతెనపై కొంత భాగం కూలి సముద్రంలో పడిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఎలా జరిగిందన్నదానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు.

ఎక్కుడుందీ వంతెన..?

ఉక్రెయిన్ -క్రిమియా-రష్యా మధ్యలోని అజోవ్ సముద్రాన్ని నల్ల సముద్రాన్ని కలిపేదే కెర్చ్ జలసంధి. ఉక్రెయిన్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని నల్ల సముద్రం ద్వారానే సాగిస్తుంటుంది. అజోవ్ తీరం నుంచి నల్లసముద్రం మీదుగా ఉక్రెయిన్ వాణిజ్యం సాగాలంటే కెర్చ్ జలసంధిని దాటాలి. అయితే ఇంతలా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన నల్ల సముద్రంపై రష్యా కన్నేసింది. 2014లో క్రిమియా ద్వీపాన్ని ఆక్రమించింది. క్రిమియాతో అనుసంధానం అయ్యేలా 2018లో 3 బిలియన్ డాలర్లు వెచ్చించి రోడ్డు రైలు వంతెనను కట్టింది. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ వంతెన ప్రారంభ సమయంలో పుతిన్ స్వయంగా ట్రక్కు నడిపారు. ఇక ఈ యుద్ధంలో రష్యా ఈ మార్గం ద్వారానే ఆయుధాలు బలగాలను చేరవేస్తోంది.

ఉక్రెయిన్ అధికారులను బట్టి చూస్తే..

రష్యా ఆయుధాలు ఇతర అవసరమైన వస్తువుల సరఫరాకు వినియోగించుకుంటుండడంతో కెర్చ్ వంతెనపై తాము గురిపెట్టినట్లు ఉక్రెయిన్ కమాండర్ ఒకరు ఇటీవల వ్యాఖ్యానించారు. రష్యాను అడ్డుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తామని హెచ్చరించారు. రష్యా సేనలను అడ్డుకునే క్రమంలో ఈ వంతెనపై ఉక్రెయిన్ ఎప్పటినుంచో దృష్టిపెట్టింది.

అయితే రష్యా దీన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్ దాడిచేస్తే ప్రతిచర్య అత్యంత తీవ్రంగా ఉంటుందని రష్యా తీవ్రంగా హెచ్చరించింది కూడా. తాజా పేలుడుతో ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారే ప్రమాదముంది.


Recent Random Post: