టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత దసరా పండుగను సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావిస్తుంటారు. ఫెస్టివల్ హాలీడేస్ ను క్యాష్ చేసుకోవాలని అందరూ స్లాట్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. విజయ దశమికి విజయాలు అందుకోవాలని బరిలో దిగుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది పండక్కి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పటికే ‘దేవర 1’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా.. మరో క్రేజీ మూవీ కూడా ఈ రేసులోకి రాబోతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమా మొదటి భాగాన్ని ముందుగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగకపోవడంతో, కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు అదే సీజన్ లో ‘తండేల్’ చిత్రాన్ని కూడా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ చందూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని దసరా స్పెషల్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలను ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అంటే 2024 దసరాకి ‘దేవర పార్ట్ 1’, ‘తండేల్’ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీ పడబోతున్నాయన్నమాట. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రెండూ కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు. ఒకటి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అయితే, మరొకటి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్. ఇవి ఒకేసారి థియేటర్లలోకి వస్తే రెండిటి మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కచ్ఛితంగా ఇంట్రెస్టింగ్ క్లాష్ అవుతుందని భావించవచ్చు. మరి కోస్టల్ బ్యాక్ డ్రాప్ వీటికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
ఇకపోతే ‘తండేల్’ సినిమా గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ఒక మత్స్యకారుడి నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో చైతన్య ఒక బెస్త వాడి పాత్రలో, రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించనున్నారు. ‘లవ్ స్టోరీ’ తర్వాత చై – సాయి పల్లవి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ మీద నమ్మకంతో మేకర్స్ దాదాపు రూ.70 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని టాక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ‘దేవర 1’ మూవీపై కూడా అంచనాలు నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
Recent Random Post: