జె.పి.చంద్ర‌బాబు బ‌యోపిక్‌లో ధ‌నుష్‌

వ‌రుస‌గా ప్ర‌యోగాత్మక చిత్రాల‌తో త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌. అత‌డు న‌టించిన కెప్టెన్ మిల్ల‌ర్, రాయ‌న్ 2024 సినిమాల్లో క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నాయి. న‌టుడిగా త‌న స్థాయిని పెంచిన చిత్రాలివి. 2025లో ధ‌నుష్ న‌టిస్తున్న వ‌రుస బ‌యోపిక్ లు విడుద‌ల కానున్నాయి. ప్ర‌స్తుతం అత‌డు మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ వెట‌ర‌న్ కామెడీ న‌టుడు జె.పి.చంద్ర‌బాబు బ‌యోపిక్ లో ధ‌నుష్ న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఇళయరాజా బయోపిక్ తర్వాత లెజెండరీ యాక్టర్ జోసెఫ్ పనిమయదాస్ చంద్రబాబు బయోపిక్ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.

నాటి రోజుల్లో హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న త‌మిళ క‌మెడియ‌న్ గా జే.పి. చంద్ర‌బాబుకు గుర్తింపు ఉంది. అత‌డి క‌థ బ‌యోపిక్ మెటీరియ‌ల్ అన్న ప్ర‌చారం సాగుతోంది. `ది లెజెండ్ ఆఫ్ చంద్ర‌బాబు` అనే పుస్త‌కం ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

మ‌రోవైపు ధ‌నుష్ వ‌రుస‌గా త‌న సినిమాల‌కు తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇళ‌య‌రాజా బ‌యోపిక్ లో టైటిల్ పాత్ర‌ను పోషిస్తూనే, స్వీయ‌ద‌ర్వ‌క‌త్వంలో దీనిని రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌దుప‌రి జే.పి. చంద్ర‌బాబు బ‌యోపిక్ కి కూడా ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ధ‌నుష్‌ 2017 చిత్రం `పవర్ పాండి`తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, రేవతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ లో 3 అనే సినిమాకి కూడా ద‌ర్శ‌క‌త్వ స‌హ‌కారం అందించాడు. ఆ తర్వాత ధనుష్ చాలా కాలం సినిమాల దర్శకత్వంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇటీవ‌ల `రాయ‌న్` కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెంట‌నే ఇళ‌య‌రాజా బ‌యోపిక్ కి ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తున్నాడు.


Recent Random Post: