టాలీవుడ్‌లో ఐటీ దాడులు, రవి ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు


టాలీవుడ్‌లో ఐటీ శాఖ సోదాలు రెండో రోజుకూ కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇళ్లతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులపై కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా టీమ్ కూడా ఈ దాడుల్లో ప్రాధాన్యత పొందింది. దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులపై సోదాలు కొనసాగుతుండటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాశ్ తనదైన శైలిలో ‘పుష్ప’, అల్లు అర్జున్‌లను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రవి ప్రకాశ్, “అతిశయోక్తితో నిండిన ‘పుష్ప’ బాక్సాఫీస్ నంబర్లు, అల్లు అర్జున్‌ను గ్లోబల్ స్టార్ చేస్తాయని అనుకుంటే, ప్రస్తుతం ఆ సినిమా అతని దురదృష్టంగా మారింది. మొదట సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట దుర్ఘటన, తర్వాత బాధితులను పరామర్శించడంలో నిర్లక్ష్యం చూపించడం, ఇప్పుడు ఆ నంబర్లు ఐటీ దాడుల్లో అతనిని వెంటాడుతున్నాయి. బహుశా ‘పుష్ప 3’కి ‘రెక్లెస్ రిటర్న్స్’ అని పేరు పెట్టాలి” అంటూ ఎద్దేవా చేశారు.


రవి ప్రకాశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి ప్రకాశ్ అటెన్షన్ కోసం, సెన్సేషన్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా రవి ప్రకాశ్, “షోబిజ్ సర్కస్ ఎప్పుడూ ఆశ్చర్యపరచదు. విషాదం లేదా ప్రమాదం కూడా వారి ప్రచారానికి ఒక సాధనమే. రీ-రిలీజ్ కోసం మనస్పూర్తిగా ఉన్న సంఘటనలను వాడుకోవడం తగదు” అని తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

ఇది మొదటిసారి కాదు. రవి ప్రకాశ్ గతంలో కూడా ‘పుష్ప 2’, అల్లు అర్జున్‌లను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. మేకర్స్ పై జరుగుతున్న ఐటీ దాడులు, సినీ పరిశ్రమలో ట్రాన్సాక్షన్లపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: