టాలీవుడ్ కు కొత్త దారి చూపించిన బన్నీ..!

Share

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇతర ఇండస్ట్రీలలో తెలుగు మార్కెట్ ఓపెన్ చేస్తున్న హీరోలకు అల్లు అర్జున్ చేస్తున్న పనులే మార్గ నిర్దేశం చేస్తున్నాయి. ముఖ్యంగా మొన్న ‘పుష్ప’ సినిమాతో బన్నీ సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా హిందీలో 100 కోట్ల వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘పుష్ప: ది రైజ్’ సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ అంతా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిపోయారు. స్టార్ హీరోల నుంచి చిన్న వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ మున్నీ నటనను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. పైగా సినిమాలో అతని మేనరిజమ్స్ అన్నీ బయట ఫాలో అవుతున్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఎంతోమంది రీల్స్ చేసి వరల్డ్ పాపులారిటీ తీసుకొచ్చారు.

పుష్పకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడంతో.. ఇప్పుడు తెలుగు సినిమాలకు బాలీవుడ్ మార్కెట్ ఓపెన్ చేసిన హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. ఇదివరకు కొన్ని పాన్ ఇండియన్ సినిమాలను మాత్రమే నిర్మాతలు ముందు నుంచి ప్లాన్ చేసుకుని హిందీలో విడుదల చేసేవాళ్లు. మరోవైపు తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ రైట్స్ మాత్రమే అమ్మేసి.. థియెట్రికల్ రిలీజ్ కు దూరంగా ఉండేవాళ్లు. అది టీవీలో యూట్యూబ్ లో విడుదలయ్యేవి.

కానీ ‘పుష్ప’ తర్వాత మాత్రం అలా కాదు.. తమ ప్రతీ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని నిర్మాతలను హీరోలు కోరుతున్నారు. దానికి కారణం అల్లు అర్జున్. తన సినిమాను ప్రమోట్ చేసిన తీరు.. హిందీలో అది సాధించిన వసూళ్లు చూసిన తర్వాత ప్రతీ హీరో కూడా ఇప్పుడు బాలీవుడ్ లో మార్కెట్ విస్తరించుకోవాలని కలలు కంటున్నారు.

గతంలో మలయాళంలోనూ తెలుగు సినిమాలకు మార్కెట్ ఓపెన్ చేసిన హీరో అల్లు అర్జున్ మాత్రమే. బన్నీ సినిమాలకు అక్కడ అదిరిపోయే మార్కెట్ ఉంది. ఈయన సినిమాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి స్టార్ హీరోలు తమ చిత్రాల విడుదలలు ప్లాన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు హిందీలోనూ డబ్బింగ్ సినిమాలతో బన్నీకి ముందు నుంచి మార్కెట్ ఉండేది. కానీ ‘పుష్ప’ తర్వాత అది మరింత పెరిగిపోయింది.

ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం తర్వాత ప్రతీ హీరో తమ సినిమాలను హిందీలో విడుదల చేస్తున్నారు. ‘పుష్ప 2’ వచ్చేసరికి ఆ మార్కెట్ ఇంకాస్త పెరిగిపోవడం ఖాయం. కేవలం హిందీలోనే కాదు.. నేపాలీ – బెంగాలీ లాంటి భాషల్లోనూ అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ బాగానే ఉంది. అక్కడ ప్రేక్షకులు కూడా ఈయన సినిమాలను చూస్తున్నారు. త్వరలోనే అక్కడ కూడా బన్నీ సినిమాలు విడుదల కావడం ఖాయం.

ఏదేమైనా అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న కథలు మాత్రమే కాదు.. సినిమాలు వీలైనన్ని ఇండస్ట్రీలకు విస్తరిస్తున్న తీరు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. అదే అంతా ఫాలో అవుతున్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇదే క్రమంలో పలు పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.


Recent Random Post: