బాలీవుడ్ పని చేయడం ఆపేసింది. ఆలోచించడం ఆపేసింది. ఎక్కువలో ఎక్కువ సేఫ్ గేమ్ ఆడటానికే అధిక ప్రాధాన్యతనివ్వడం మొదలు పెట్టింది. కొరియన్ సినిమాలు.. లేదా.. హాలీవుడ్ అఫీషియల్ రీమేక్లు.. తమిళ తెలుగు రీమేక్ లతో కాలం వెళ్లదీస్తూ సేఫ్ గేమ్ ఆడటం మొదలు పెట్టింది. ఒక భాషలో ఇప్పటికే హిట్టయిన సినిమా అయితే గ్యారెంటీగా ఇక్కడ కూడా హిట్ చేయెచ్చు అనే కాన్సెప్ట్ నమ్ముకుని అమీర్ ఖాన్ నుంచి తాప్సీ వరకు ఇదే పంథాని అనుసరిస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అయితే ఆ సేఫ్ గేమ్ ని ఆపేసే టైమొచ్చినట్టుందంటున్నారు. బాలీవుడ్ సేఫ్ గేమ్ లో భాగంగా ప్రస్తుతం ఏ ఏ సినిమాలని రీమేక్ చేస్తోందో ఓ లుక్కేద్దాం.
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా చివరికి హాలీవుడ్ రీమేక్ నే ఎంచుకోవాల్సి వచ్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `లాల్ సింగ్ చద్దా`. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని టామ్ హంక్స్ నటించిన హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా తెరకెక్కించారు. లాల్ సింగ్ అమాయకుడు. అంతే కాకుండా అతనికి చిన్న పాటి శారీరక లోపం కూడా వుంటుంది. దీంతో అంతా అతన్ని హేళన చేస్తుంటారు.
తన పుట్టుకకు ఓ కారణం వుందని భావించిన లాల్ సింగ్ ఆర్మీలో చేరతాడు. ఎప్పటికైనా తన చిన్న నాటి స్నేహితురాలిని కలుసుకోవాలన్నది లాల్ సింగ్ లక్ష్యం. అతని లక్ష్యం నెరవేరిందా? లేదా? అన్నదే ఈ చిత్ర కథ. హాలీవుడ్ లో 1994లో విడుదలై కామెడీ డ్రామాగా మంచి విజయాన్ని సాధించిన `ఫారెస్ట్ గంప్` హిందీలోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో అమీర్ ఖాన్ ఈ మూవీని స్వయంగా అమీర్ ఖాన్ నిర్మిస్తూ నటించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ హీరో నాగచైతన్య హిందీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఆగస్టు 11న ఈ మూవీ విడుదల కానుంది.
ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ మరో హాలీవుడ్ రీమేక్ పై కూడా కన్నేశారట. 2018లో వచ్చిన `కాంపియన్స్` రీమేక్ లో నటించబోతున్నారట. మానసిక లోపాలున్న బాస్కెట్ బాల్ క్రీడాకారులకు కోచ్ గా అమీర్ ఖాన్ ఇందులో కనిపించనున్నారట. ఇక ఇదే తరహాలో మరో హాలీవుడ్ ఫిల్మ్ కూడా బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. 2015లో వచ్చిన `ది ఇంటర్న్`ని హిందీలో రిషీకపూర్ దీపికా పదుకోన్ లతో రీమేక్ చేయాలనుకున్నారు. అయితే రిషి కపూర్ మరణించడంతో ఆ పాత్రలో ఇప్పడు అమితాబ్ బచ్చన్ ని తీసుకున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.
2010లో వచ్చిన `జూలియస్ ఐస్` అనే హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ని హిందీలో `బ్లర్` పేరుతో రీమేక్ చేశారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కంటిచూపు కోల్పోతున్న ఓ యువతి తన సోదరిని హత్య చేసిన వాడిని ఎలా పట్టుకుంది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనే ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. కథ పాత్ర నచ్చడంతో తాప్సీ ఓ నిర్మాతగా వ్యవహరించింది.
ఇక 2016లో వచ్చిన `బ్లైండ్` అనే హాలీవుడ్ మూవీ ని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. సోనమ్ కపూర్ కీలక పాత్రలో నటిస్తోంది. చూపు కోల్పోయిన ఓ యువతి ఇన్వేస్టిగేషన్ విషయంలో ఎలా సహాయపడింది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయి సినిమా రిలీజ్ కు రెడీగా వుంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇదే బాటలో టైగర్ ష్రాఫ్ కూడా హాలీవుడ్ రీమేక్ పై పడ్డాడు.
సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన `రాంబో : ఫస్ట్ బ్లడ్` (1982) ని టైగర్ ష్రాఫ్ తో రీమేక్ చేయబోతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి రీమేక్ లతో నెట్టుకొస్తున్న ఈ హీరో ఇప్పటికీ రీమేక్ లని వదలడం లేదు. అయితే తాజాగా పుష్ప ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ చాప్టర్ 2 లు బాలీవుడ్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడంతో చాలా మంది ఆడియన్స్ బాలీవుడ్ రీమేక్ ల ని పక్కన పెట్టే సమయం వచ్చేసిందంటూ సెటైర్లు వేస్తున్నారట.
Recent Random Post: