బర్త్‌డే స్పెషల్‌: రెండు దశాబ్దాలైనా అదే అందం, అదే క్రేజ్‌ @ త్రిష


సాదారణంగా హీరోల కెరీర్‌ స్పాన్‌ కంటే హీరోయిన్స్‌ కెరీర్‌ చాలా తక్కువ సమయంకే ముగుస్తుంది. ఒకప్పుడు హీరోయిన్స్‌ పది పదిహేను సంవత్సరాలు కొనసాగేవారు. కాని గత కొంత కాలంగా మాత్రం హీరోయిన్స్‌ మూడు నాలుగు సంవత్సరాలకే కనుమరుగవుతున్నారు. పదేళ్లు స్టార్‌ హీరోయిన్స్‌గా ఉన్నారంటే చాలా గొప్ప విషయం. కాని రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా అందులో పుష్కర కాలం పాటు తెలుగు, తమిళంలో టాప్‌ స్టార్‌, మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ త్రిష. సౌత్‌ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించింది.

1999లో జోడీ చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన త్రిష 2002 సంవత్సరం నుండి పూర్తి స్థాయి నటిగా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆమె దక్కించుకున్న సూపర్‌ హిట్స్‌, ఆమె సాధించిన ఘనతలు ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ ఎవరు కూడా చూసి ఉండరు. తెలుగులో ఈమె సీనియర్‌ స్టార్స్‌ తోనే కాకుండా ఈతరం స్టార్స్‌తో కూడా నటించింది. తెలుగులో అత్యధిక హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్స్‌లో త్రిష ముందు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో త్రిష వేసిన ముద్ర మామూలుది కాదు.

2004వ సంవత్సరంలో ప్రభాస్‌తో ఈ అమ్మడు చేసిన ‘వర్షం’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో ఈ అమ్మడి అల్లరి ఇంకా నటన అందరికి నచ్చింది. ఆ తర్వాత ఏడాదిలోనే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తెలుగులో త్రిష మరింత స్టార్‌డంను దక్కించుకుంది. అదే ఏడాది మహేష్‌బాబుతో చేసిన అతడు సినిమా ఆమె కెరీర్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లింది. ఆ తర్వాత త్రిష వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో వరుసగా స్టార్‌ హీరోలతో నటిస్తూనే తమిళంలో కూడా ఈ అమ్మడు వరుసగా చిత్రాలు చేస్తూ అక్కడ ఇక్కడ నెం.1 హీరోయిన్‌గా ఒకానొక సమయంలో త్రిష నిలిచింది.

2016 సంవత్సరం వరకు త్రిష ఏడాదికి నాలుగు అయిదు అంతకు మించి సినిమాలు చేస్తూ వచ్చింది. వయసు పెరగడంతో పాటు కొన్ని ఫెయిల్యూర్స్‌ వల్ల ఆమెను ఫిల్మ్‌ మేకర్స్‌ పక్కన పెట్టారు. దాంతో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేయడం మొదలు పెట్టింది. ఫిల్మ్‌ మేకర్స్‌ ఆమెను పక్కన పెట్టినా తెలుగు, తమిళ ప్రేక్షకులు మాత్రం ఇంకా ఆమెను ఆరాధిస్తూనే ఉన్నారు. ఆమెకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ తక్కువేం కాదు. అందుకే ఇంకా ఆమెకు సూట్‌ అయ్యే పాత్రలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవలే ఈమెకు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య చిత్రంలో ఆఫర్‌ వచ్చింది. షూటింగ్‌లో కూడా రెండు రోజులు పాల్గొన్న తర్వాత పాత్ర నచ్చలేదంటూ వెళ్లి పోయింది. తెలుగులో సినిమాలు ఏమీ చేయకున్నా తమిళంలో మాత్రం ప్రతిష్టాత్మకంగా మణిరత్నం తెరకెక్కించబోతున్న సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. మరో రెండు మూడు తమిళ సినిమాలకు కూడా ఈమె ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

36 ఏళ్ల వయసులో కూడా ఇంకా కుర్ర హృదయాలను కొల్లగొడుతూనే ఉన్న త్రిష మరో పదేళ్లయినా ఇదే అందం ఇంతే క్రేజ్‌తో ఉంటుందని ఆమె అభిమానులు అంటున్నారు.

నేడు త్రిష పుట్టిన రోజు సందర్బంగా ఆమెకు అభిమానుల తరపున, తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.


Recent Random Post: