#గుసగుస: డిటాక్సిఫికేషన్ ప్రక్రియలో చిరు..!

నిరంతర శ్రమతో అలసిసొలసిన శరీరానికి విశ్రాంతి కావాలి. పైగా శరీరం నుంచి అంతర్గతంగా పోగై ఉన్న విషప్రదార్థాలను బయటకు పంపించాలి. అందుకోసం నిర్ధేశించినదే డిటాక్సిఫికేషన్. మైండ్ అండ్ సోల్ ని కూడా క్లీన్ చేయడం ఈ ఆయుర్వేద ప్రక్రియ ప్రత్యేకత. టాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా అనుసరించే ప్రక్రియ ఇది. దీనివల్ల శరీరంలో గ్లో కూడా అమాంతం పెరుగుతుంది. ప్రతిసారీ మెగా కాంపౌండ్ హీరోలు చిరంజీవి.. రామ్ చరణ్.. బన్ని సహా ఇతర యువహీరోలు ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారని కథనాలొచ్చాయి.

ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి విశాఖలో తన ఫేవరెట్ ఆయుర్వేదిక్ స్పా ట్రీట్ మెంట్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడ డిటాక్సిఫికేషన్-ఆయుర్వేద ప్రక్రియలో ఉన్నారు. ఇప్పటికే ఆచార్య చిత్రీకరణను పూర్తి చేసి లూసీఫర్ రీమేక్ కోసం సన్నాహకాల్లో ఉన్న చిరంజీవి తదుపరి కొత్త లుక్ లో కనిపించాల్సి ఉంటుంది.

విదేశీ ట్రీట్ మెంట్ ని ఎంచుకోకుండా విశాఖనే చిరు ఎందుకు ఎంపిక చేశారు? అంటే.. ఏనాటికైనా బీచ్ సొగసుల నగరం విశాఖలోనే తన బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేస్తానని మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు ప్రకటించారు. విశాఖతో తన కెరీర్ ఆరంభం నుంచి ఎంతో గొప్ప అనుబంధం ఉందని ప్రకటించారు. అలాగే వైజాగ్ టాలీవుడ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేందుకు మెగాస్టార్ చిరంజీవి సంసిద్ధంగా ఉన్నారు. ఇలా రకరకాల కోణాల్లో ఆయనకు విశాఖతో అనుబంధం ఉంది. చాలా మంది సెలబ్రిటీలు విదేశాలకు వెళుతుంటే.. చిరంజీవి మాత్రం ప్రత్యేకించి డిటాక్సిఫికేషన్ కోసం విశాఖనే ఎంచుకోవడానికి కారణమిదే.

చిరు విశాఖలో ఆయుర్వేద చికిత్స తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు ఇదే స్పాకు వచ్చారు. గతంలో వారంపదిరోజుల పాటు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజు కూడా ఆయనతో ఉన్నారు. ఇప్పుడు కూడా ఓ పది రోజుల తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ కి వెళతారు.

ప్రస్తుతం లూసీఫర్ రీమేక్ కోసం మోహన్ రాజా సర్వసన్నాహకాల్లో ఉన్నారు. ఇందులో చిరుతో పాటు సత్యదేవ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం మరో హీరోని వెతుకుతున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

రీమేక్ టైటిల్ ఫిక్స్..!

లూసీఫర్ రీమేక్ టైటిల్ ని ఇటీవలే ఫిక్స్ చేశారని తెలిసింది. `గాడ్ ఫాదర్` అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నారని తెలిసింది. అయితే ఈ టైటిల్ ఇప్పటికే రామ్ చరణ్ `రచ్చ` దర్శకుడు సంపత్ నంది వద్ద ఉంది. అతడు టైటిల్ ని ఇంతకుముందే ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. మెగాస్టార్ మూవీ కోసం అదే టైటిల్ ని ఎంపిక చేయడం యాథృచ్ఛికం. అయినా చరణ్ స్వయంగా తనకు గాడ్ ఫాదర్ టైటిల్ కావాలని సంపత్ నందిని సంప్రదించారట. తన ఫేవరెట్ హీరో అడగ్గానే మరో ఆలోచనే లేకుండా ఆ టైటిల్ ని సంపత్ నంది ఎంతో ఆనందంగా చిరు కోసం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ టైటిల్ ని రీమేక్ నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్-చరణ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. రామ్ చరణ్ తో రచ్చ లాంటి మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కించిన సంపత్ నందికి మెగా కాంపౌండ్ తో మంచి సత్సంబంధాలున్నాయి. సంపత్ ప్రస్తుతం చరణ్ కోసం మరో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Recent Random Post: