మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సోషల్ డ్రామా రిపబ్లిక్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. రేపు (సెప్టెంబర్ 22) ఉదయం 10 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. సెప్టెంబర్ 10 న అనూహ్యంగా జరిగిన బైక్ ప్రమాదం తరువాత సాయి తేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్న సంగతి తెలిసిందే.
రిపబ్లిక్ టీజర్ ఇప్పటికే అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సాయి తేజ్ పంజా అభిరామ్ అనే నిజాయితీగల జిల్లా కలెక్టర్ గా నటించాడు. అవినీతి వ్యవస్థపై సాయి తేజ్ తిరుగుబాటును ప్రదర్శించే సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయని తెలిసింది. దేవ కట్టా దర్శకత్వంలో ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది.
ఐశ్వర్య రాజేష్- జగపతి బాబు- రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. భగవాన్ -పుల్లారావు సంయుక్తంగా సినిమాను నిర్మించారు. రిపబ్లిక్ అక్టోబర్ 1 న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
చెప్పిన తేదీకే విడుదల
మెగా మేనల్లుడు సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ అనంతరం రిపబ్లిక్ చిత్రాన్ని రిలీజ్ చేయడం బాగోదని నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ అలాంటిదేమీ లేదని ఇప్పటికే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసారు. కానీ ఇంతలో సాయి యాక్సిడెంట్ తో రిలీజ్ వాయిదా పడుతుందని భావించారు. కానీ రిపబ్లిక్ ని నిర్మాతలు అనుకున్నట్లుగానే అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. జీటీవీ సంస్థ సినిమా హక్కులన్ని చేజిక్కించుకుంది. మార్కెట్ సహా అన్ని రకాల రైట్స్ అదే సంస్థకు నిర్మాతలు కట్టబెట్టారు. కాబట్టి రిలీజ్ విషయంలో వెనుకడుగు వేసేది లేదని సదరు సంస్థ ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి తేజ్ మినహా అంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్ల వాయిదా లేదని తెలుస్తోంది. ఈ సినిమాని నిర్మాతలే నేరుగా రిలీజ్ చేయడం అంటే వెనక్కి తగ్గేందుకు ఆస్కారం ఉండేదని కథనాలొస్తున్నాయి. జీ-సంస్థ రిలీజ్ కాబట్టి కార్పోరేట్ నిబంధంనల ప్రకారం రిలీజ్ చేయాల్సిందే తప్ప ఇతర కారణాలతో వాయిదా పడటానికి వీలుండదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న థియేటర్లో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా రిలీజ్ కు చాలా కారణాలే వినిపిస్తున్నాయి.
ఇక నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు కూడా క్యూ కడతాయి. సెకెండ్ వేవ్ దాదాపు అదుపులోకి వచ్చిన నేపథ్యం..థర్డ్ వేవ్ ఇంకా ప్రారంభం కాకపోవడం వంటి సన్నివేశాల కారణంగా అగ్ర హీరోలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నారు. వాళ్లొచ్చేస్తే మీడియం హీరోలకు చోటు దొరకదు. ఆ కారణంగానూ `రిపబ్లిక్` ముందస్తు రిలీజ్ కు వస్తున్నట్లు భావించవచ్చు. కొంత గ్యాప్ తర్వాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు రిపబ్లిక్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. లవ్ స్టోరి తర్వాత మరో పెద్ద రిలీజ్ ఇదేనని కథనాలొస్తున్నాయి.
Recent Random Post: