ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించడానికి నిన్న సీనియర్ హీరో చిరంజీవితో పాటు మరి కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ కు చిరుతో పాటు మహేష్ బాబు – ప్రభాస్ – రాజమౌళి – కొరటాల శివ – ఆర్ నారాయణ మూర్తి – నిరంజన్ రెడ్డి – అలీ – పోసాని కృష్ణమురళి – డైరెక్టర్ మహి వి రాఘవ్ తదితరులు హాజరయ్యారు.
ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే అన్నిటికి శుభం కార్డు పడుతుందని భేటీ అనంతరం సినీ ప్రముఖులు సంతోషంగా మీడియా ముందు చెప్పుకొచ్చారు. చిన్న సినిమాలకు కూడా ఐదో షోకి అనుమతి ఇచ్చారని.. మరో వారం పది రోజుల్లో ఆమోదయోగ్యమైన జీవో వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మహేష్ – ప్రభాస్ – రాజమౌళి – ఆర్ నారాయణ మూర్తి కూడా జగన్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.
గురువారం సీఎంతో సినీ ప్రముఖుల భేటీకి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్ చేసుకునేందుకు తపన తాపత్రయంతోనే అడుగులు ముందుకు వేశామని జగన్ చెప్పారు. చిరంజీవి – మహేష్ సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. అయితే మెగాస్టార్ మరీ వినమ్రంగా మాట్లాడటంపై ఫ్యాన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి ప్రతీ మాటకు ముందూ వెనుకా థాంక్యూ వెరీ మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్పడం.. ధన్యవాదాలు తెలపడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని గౌరవిస్తూ మాట్లాడటంలో తప్పులేదు కానీ.. మరీ ఇంతలా ధన్యవాదాలు చెప్పడం ఎందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో అన్నిసార్లు థాంక్స్ చెప్పిన చిరు.. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అదే విధంగా మాట్లాడారని అంటున్నారు.
అక్కడితో ఆగకుండా చిరు ఇంటికి వెళ్ళాక ట్విట్టర్ వేదికగా మరొకసారి ధన్యవాదాల కార్యక్రమం పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. మీడియాలో కనిపించిన వీడియోలలో అన్నిసార్లు ‘థాంక్స్’ చెప్తే.. కెమెరా కళ్ళకు కనిపించకుండా ఇంకెన్ని సార్లు కృతజ్ఞతలు తెలిపారో.. ఈ వ్యవహారం మొత్తంలో మెగాస్టార్ ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుంటారో అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.
‘దయచేసి ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలని.. చేతులు జోడించి అడుగుతున్నాను’ అని చిరంజీవి అభ్యర్థించడం ఏంటని మెగా అభిమానులు – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు చేయడమే కాకుండా.. సెంట్రల్ మినిస్టర్ గా చేసిన మెగాస్టార్ ని ఇలా చూడలేకపోతున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం సీఎంకి విజ్ఞప్తులు చేయడంలో తప్పులేదు కానీ.. మరీ ఇలా వేడుకోవడం ఏంటని అంటున్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం చిరంజీవి మీద సెటైర్లు వేశారు. “చిరంజీవి సార్.. నేను మెగా అభిమానిగా మీ మెగా బెగ్గింగ్ తో మెగా హర్ట్ అయ్యాను” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేసి డిలీట్ చేసారు. ఏదేమైనా టాలీవుడ్ కు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. ఆ క్రెడిట్ అంతా చిరుకే దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినీ కార్మికుల కోసం.. పెద్ద సినిమాలతో పాటుగా చిన్న చిన్న చిత్రాలకు ప్రయోజనం చేకూరేలా చిరంజీవి వ్యవహరించారని అంటున్నారు. మరి ఫిబ్రవరి నెలాఖరుకు అందరూ ఆశించిన జీవో వస్తుందో లేదో చూడాలి.
Recent Random Post: