ఆయన దిల్‌ రాజు కాదు.. కిల్‌ రాజు..

సంక్రాంతి పండుగ అంటే పిండి వంటకాలు, కోళ్ల పందేలతో పాటు కొత్త సినిమాల సందడి కూడా. ముఖ్యమైన పండగ సీజన్‌లలో స్టార్‌ హీరోల సినిమాలతో థియేటర్లు నిండిపోతాయి. ఈ క్రమంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక ఆయా సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు ఇబ్బందులు పడతారు. అందుకే సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలు వస్తే చాలు థియేటర్‌ల ఇష్యూ ఎక్కువగా ఉంటుంది. బడా నిర్మాతలైన దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్‌ల గుప్పిట్లోనే ఎక్కువగా థియేటర్స్ ఉన్నాయంటూ చిన్న నిర్మాతలు ఆరోపిస్తుంటారు. వీరి వల్ల చిన్న సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు నష్టపోతున్నామంటూ వాపొతుంటారు. ఈ నేపథ్యంలో ఈ పండగకు వరంగల్‌కు చెందిన క్రాక్‌ డిస్ట్రిబ్యూటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ సంక్రాంతికి ముందుగా మాస్‌ మహారాజ రవితేజ ‘క్రాక్’ సినిమా విడులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను డిస్ట్రిబ్యూట్‌ చేసిన ‘క్రాక్’‌ సినిమాకు సరైన థియెటర్లు ఇవ్వలేదంటూ వరంగల్‌కు చెందిన శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్‌ నిర్మాత దిల్‌ రాజు తీరుపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ.. సంక్రాంతికి విడుదలైన రవితేజ క్రాక్‌ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, బాగా నడుస్తోన్న ఈ చిత్రానికి థియేటర్లు బాగా తగ్గించేసి డబ్బింగ్ సినిమా అయిన విజయ్ ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని దిల్ రాజుపై అసహనం వ్యక్తం చేశారు. అందుకే దిల్‌ రాజు పేరును కిల్‌ రాజుగా మర్చాలని మండిపడ్డారు. అయితే గతంలో హీరో రజినీకాంత్ ‘దర్బార్’ ‘పేట’ వంటి తమిళ డబ్బింగ్‌ సినిమాల విడుదలపై దిల్‌ రాజు సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. డబ్బింగ్ సినిమాలకు ఎలా థియోటర్లు ఇస్తామని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. ఆయన మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా ‘క్రాక్’ వంటి తెలుగు సినిమాకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బింగ్‌ మూవీ ‘మాస్టర్’‌కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆరోపించారు. తాను డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న క్రాక్ సినిమాకు ఒకవేళ టాక్ బాగాలేకపోయినట్టైయితే.. తాను మాట్లాడేవాడిని కాదని, కానీ క్రాక్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుందన్నారు. అలాంటి మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను సడెన్‌గా థియేటర్స్‌లోంచి లేపేశారంటూ అతడు అవేదన వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: