ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. చాలా రోజుల తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. క్రాక్ బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా హిట్ సాధించినప్పటికీ ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్థిక వ్యవహారాల కారణంగా క్రాక్ విడుదల రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు.
క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన పెండింగ్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చేయాలని కోరాడు. గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు చేపడుతోంది. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సంపాదించుకుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టి ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. అంతేకాకుండా నేటి నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Recent Random Post: