ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో ఉత్తరాదికి తెలియజెప్పిన ఫ్యాన్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీకి వచ్చిన తారక్.. తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగారు. యాక్టింగ్ లో డ్యాన్స్ మరియ డైలాగ్ డెలివరీలో తనకు తానే సాటి అని నిరూపించిన జూనియర్.. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా మెప్పిస్తుంటారు. ఈ క్రమంలోనే అశేష అభిమాన ఘనాన్ని ఏర్పరచుకున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ”ఆర్.ఆర్.ఆర్” చిత్రంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇది తారక్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. వచ్చే నెలలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మేకర్స్ ఆదివారం ముంబైలో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తారక్ – చరణ్ లతో పాటుగా అలియా భట్ – ఎస్ఎస్ రాజమౌళి – నిర్మాత కరణ్ జోహార్ హాజరయ్యారు. RRR టీమ్ కు సపోర్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తమ అభిమాన హీరోను చూసేందుకు బారికేడ్లను బద్దలు కొట్టడమే కాకుండా.. గోడలపైకి ఎక్కి ‘వి లవ్ యూ ఎన్టీఆర్’ అంటూ గట్టిగా కేకలు వేశారు.

‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఫేవరేట్ హీరో క్రేజ్ ఏంటో ఉత్తరాదికి తెలియజెప్పారు. తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ కు.. పాన్ ఇండియా మూవీ విడుదల అవ్వకముందే జాతీయ స్థాయిలో క్రేజ్ ఉందనడానికి ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. అదే సమయంలో అభిమానులు అదే పనిగా స్లోగన్స్ చేస్తూ రచ్చ చేయడం ఈవెంట్ కు కాస్త ఇబ్బందిగా మారింది.

ఒకానొక దశలో కరణ్ జోహార్ సైతం అసహనం వ్యక్తం చేస్తూ.. ఎన్టీఆర్ అభిమానులను ఎవరూ ఆపలేరని కామెంట్ చేసారని తెలుస్తోంది. ఫ్యాన్స్ ని నియంత్రించడానికి ఎన్టీఆర్ – రాజమౌళి రంగంలోకి దిగవలసి వచ్చింది. ఈ క్రమంలో తారక్ అభిమానులను తెలుగులో హెచ్చరించారు. RRR ఈవెంట్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ బయటకు వచ్చింది.

”ఇది పద్దతిగా లేదు. అందరూ కిందికి దిగుతారా లేదా.. పద్దతిగా అందరూ కిందికి దిగి ఎంజాయ్ చేయండి. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం. మన గురించి అందరూ చాలా బాగా మాట్లాడుకోవాలి. మీరు పద్దతిగా ఉండాలి” అని ఎన్టీఆర్ గట్టిగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ తో తారక్ క్రేజ్ ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందో తెలియజేసిందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. అదే సమయంలో వేరే రాష్ట్రంలో జరిగే ఈవెంట్ లో నందమూరి ఫ్యాన్స్ పద్దతిగా నడుచుకొని ఉంటే హుందాగా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ – రామ్ చరణ్ తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ భాషల్లో సొంత డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమాతో ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటారని అందరూ భావిస్తున్నారు.

ఇకపోతే ‘టెంపర్’ సినిమాతో ట్రాక్ మార్చిన ఎన్టీఆర్.. వరుసగా ఐదు సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు RRR తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి వారసుడు ఓ రివేంజ్ డ్రామాలో నటించనున్నారు. ఇదే క్రమంలో కేజీయఫ్ ప్రశాంత్ నీల్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.


Recent Random Post: