కైకాలకి పద్మశ్రీ దక్కకపోవడం పట్ల అభిమానుల అసహనం!

కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. అయితే ఎప్పటి మాదిరిగానే ఈ సారి జాబితాలో కూడా కైకాల సత్యనారాయణ పేరు అందులో కనిపించలేదు. దాంతో ఈ విషయంలో చాలామంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కైకాల ఈ తరం నటుడు కాదు .. నటుడిగా ఆయన ప్రయాణం ఈనాటిది కాదు. అప్పట్లో ఎస్వీఆర్ .. గుమ్మడి .. కైకాల ముందువరుసలో ఉన్న కేరక్టర్ ఆరిస్టులు. ఆ జాబితాలో ప్రస్తుతం ఉన్నది కైకాల మాత్రమే. పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పద్మశ్రీ పురస్కారాల జాబితాలో కైకాల పేరు లేకపోవడం ఆయన అభిమానులకు మరోసారి ఆవేదన కలిగిస్తోంది. అర్థశతాబ్దానికి పైగా తన నట ప్రయాణంలో ఆయన అనేక విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించారు. 700 సినిమాలకి పైగా చేశారు. సాంఘిక .. జానపద .. చారిత్రక .. పౌరాణిక చిత్రాలలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తనకి ముందు ఎస్వీఆర్ వేసిన రావణుడు .. యముడు .. ఘటోత్కచుడు .. కంసుడు .. వంటి పాత్రలను చేసి మెప్పించినవారాయన. గంభీరమైన రూపం .. అందుకు తగిన వాయిస్ తో మంత్రముగ్ధులను చేసిన మహానటుడు.

అలాంటి కైకాలకి పద్మశ్రీ అందకపోవడం నిజంగా బాధపడవలసిన విషయమేనని ఆయన అభిమానులు అసంతృప్తిని .. అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో కూడా లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే కోలుకున్నారు. తనకి పద్మశ్రీ రాకపోవడం గురించి ఆయన గతంలోనే కొన్ని ఇంటర్వ్యూలలో స్పందించారు. “అవార్డులు .. పురస్కారాలు ఒక కళాకారుడికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి .. కొత్త ఊపిరిపోస్తాయి. కానీ ఏ కారణంగా నాకు రావడం లేదన్నది నాకే తెలియడం లేదు. ప్రజల అభిమానాన్నే పెద్ద అవార్డుగా భావిస్తున్నాను” అంటూ ఆయన తన సంస్కారాన్ని చాటుకున్నారు.

కైకాల ప్రతిభా పాటవాలను ఆదిలోనే గుర్తించి ఎన్టీఆర్ ఆయన ప్రోత్సహించారు. “కైకాల మీరు ఈ వేషానికి ఒప్పుకుంటేనే ఈ సినిమా చేద్దాం .. లేదంటే పక్కన పెట్టేద్దాం” అని ఎన్టీఆర్ అనేవారని ఒక సందర్భంలో కైకాల చెప్పారు. అంతగా ఎన్టీఆర్ ను ప్రభావితం చేసిన వారాయన. ఇక ఎస్వీఆర్ ఒక వేదికపై తన వారసుడు కైకాల అని చెప్పారు. కైకాల ఎదురుగా నిలబడి డైలాగ్ చెప్పడానికి చాలామంది ఆర్టిస్టులు జంకేవారని అక్కినేని అన్నారు. ఇలా తన సమకాలికులతో ప్రశంసలను అందుకున్న కైకాలకు పద్మశ్రీ దక్కకపోవడం విచారించవలసిన విషయమే. ఇండస్ట్రీ పెద్దలు .. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతనైనా ఉందనేది అభిమానుల వైపు నుంచి వినిపిస్తున్న మాట.


Recent Random Post: