టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ చాలా గ్యాప్ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం ఈరోజు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు.. తదుపరి చిత్రాల వివరాలు మరియు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు.
స్వామీ వివేకానంద మీద సినిమా తీయాలని వుంది. ‘గాంధీ’ మూవీ స్థాయిలో వైడ్ స్కేల్ లో ప్రపంచం మొత్తం చూసేలా ఓ సినిమా చేయాలని వుంది. అది ఎప్పటికి అవుతుందో తెలియదు. నాకు అంత అనుభవం రావాలి. దానికి చాలా పరిశోధన చేయాలి. నేను తెలుసుకున్న మోస్ట్ పవర్ ఫుల్ సోల్ వున్న వాళ్లలో స్వామి వివేకానంద ఒకరు అని కొరటాల తెలిపారు.
వివేకానంద ఇండియాని బాగా ప్రభావితం చేశారు. సోషల్ మీడియా – మీడియా వంటివి ఏమీ లేని రోజుల్లో.. 19వ శతాబ్దంలోనే అంత ఇన్ఫ్లూయెన్స్ చేశారంటే ఆయన ఎలాంటి పర్సనాలిటీయో అర్థం చేసుకోవచ్చు. ఆయన అందించిన సందేశాన్ని ప్రపంచానికి చేరవేయాలంటే ఓ సినిమా తీయాలి. ‘గాంధీ’ సినిమాని ఎలా తీశారో ఆ రేంజ్ లో స్వామీ వివేకానంద పై సినిమా తీయాలి. చిన్న స్కేల్ లో మాత్రం తీయకూడదన్నారు.
లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ లని రాయాలని ప్రతీ ఒక్కరికీ ఆసక్తి వుంటుంది. స్వామీ వివేకానంద కంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ వుంటుందా? అసలు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయనపై సినిమా తప్పకుండా చేస్తా అని కొరటాల తన మనసులో మాట బయటపెట్టారు. అయితే ఇందులో ఏ హీరో నటిస్తే బాగుంటుందనే చర్చ అప్పుడే మొదలైంది.
స్వామీ వివేకానందను అమితంగా ఇష్టపడే విక్టరీ వెంకటేష్ ఆయన కథతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వివేకానంద బోధనల ప్రభావం తనపై ఎంతగానో ఉందని.. అందుకే ఆయన కథతో సినిమా చేయాలనుకుంటున్నాని వెంకీ చెబుతూ వస్తున్నారు.
కానీ వెంకటేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ కు సరైన దర్శకుడు తారసపడకపోవడంతో ఇది ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో డైరెక్టర్ నీలకంఠ ఈ కథ మీద కొంతకాలం వర్క్ చేసి ఆపేశారనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు కొరటాల కూడా స్వామీ వివేకానంద కథను సినిమా రూపంలో ఈ ప్రపంచానికి చెప్పాలని ఆశ పడుతున్నారు.
ఇద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటే కాబట్టి వెంకటేశ్ – కొరటాల శివ కాంబినేషన్ లో వివేకానంద సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. మరి అగ్ర దర్శక హీరోలు ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి. ఇకపోతే కొరటాల తన నెక్స్ట్ మూవీని ఎన్టీఆర్ తో చేయనున్నారు. జూన్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే క్రమంలో మహేష్ బాబు – అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేయాల్సి ఉంది.
మరోవైపు వెంకటేష్ ‘ఎఫ్ 3’ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే రానా దగ్గుబాటితో కలిసి వెంకీ ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇది నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Recent Random Post: