ప్రభాస్ హీరోగా రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కృష్ణంరాజు ఒక నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ తో టీమ్ అంతా కూడా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడారు. ” ఈ సినిమాలో కృష్ణంరాజు గారు ‘పరమహంస’ పాత్రలో నటించారు. ఆ పాత్ర కోసం ఆయన మూడు సంవత్సరాలపాటు గెడ్డంతో అలాగే ఉన్నారు.
కృష్ణంరాజు గారు .. ప్రభాస్ కాంబినేషన్లోని ఒక సీన్ ను చిత్రీకరిస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. వాళ్లిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. డైరెక్టర్ గారు చెప్పేవరకూ నా కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయనే సంగతి నాకే తెలియలేదు.
కరోనా సమయంలో దర్శకుడితో పాటు అందరూ దాని బారిన పడ్డారు. ఆ తరువాత షూటింగుకి కృష్ణంరాజు గారు .. ప్రభాస్ వెళ్లవలసి వచ్చినప్పుడు అంతా కూడా చాలా టెన్షన్ పడ్డాము. ఆ సమయంలో షూటింగు చేయడం నిజంగా సాహసమే. కాకపోతే అప్పటికే ఆలస్యమైపోయింది .. ఇంకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. అందువలన ఇక ధైర్యంగా ముందుకు వెళ్లారు.
ఈ సినిమాలో ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తాడు. ప్రతి ఫ్రేమ్ లోను చాలా అందంగా అనిపిస్తాడు. కాకపోతే దిష్టి తగులుతుందని చెప్పేసి అక్కడ బాగోలేదు .. ఇక్కడ బాగోలేదు అని అనేవాళ్లం. ఇకపై గోపీకృష్ణ బ్యానర్ వ్యవహారాలన్నీ కూడా పెద్దమ్మాయి ప్రసీద చూసుకుంటుంది. ఆమెకి ప్రభాస్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్ల మాదిరిగా కాకుండా మంచి స్నేహితులుగా ఉంటారు. ప్రసీద కూడా సొంత బ్యానర్ ను మళ్లీ ముందుకు తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రంగంలోకి వచ్చింది. అంతే తప్ప డబ్బుకోసం కాదు.
కృష్ణంరాజు ఫ్యామిలీ అందరిలోను ఒక లక్షణం కామన్ గా కనిపిస్తుంది. కష్టపడి పైకి రావాలి .. సంపాదించుకోవాలి. అలాగే అవసరాల్లో .. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవాలి. అందరిలోను ఇదే కనిపిస్తుంది. అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకుంటారు తప్ప దాని కోసం పరుగులు పెట్టరు.
ఇక ‘రాధే శ్యామ్’ సినిమాలో జాతకాల నేపథ్యం ఉండటం వలన ‘ప్రభాస్ కి జాతకాల పట్ల నమ్మకం ఉందా?’ అని అంతా అడుగుతున్నారు. కష్టాన్ని నమ్ముకోవాలి .. కష్టమే జీవితంలో ముందుకు తీసుకువెళుతుందని ప్రభాస్ భావిస్తాడు. అలా అని చెప్పేసి ఇతరుల నమ్మకాన్ని ఆయన విమర్శించడు” అని చెప్పుకొచ్చారు.
Recent Random Post: