గత నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టర్ అవుతోందని అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన ”మేజర్” సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పై విధంగా వ్యాఖ్యానించారు. ‘మేజర్’ సినిమా చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయని.. సినిమా చూశాక గొంతు తడారిపోయిందని మహేశ్ పేర్కొన్నారు.
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ”మేజర్”. వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాకి.. ఆయనే స్వయంగా కథ – స్క్రీన్ ప్లే అందించారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
”మేజర్” చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని మహేష్ బాబు లాంచ్ చేశారు.
2.28 నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మేజర్ సందీప్ బాల్యం – యవ్వనం – లవ్ లైఫ్ – వార్.. ఇలా ప్రతీ అంశం ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా వుంది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. ట్రైలర్ లో 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. మేజర్ సందీప్ గా అడివి శేష్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజ్ నటన మరియు డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
”మై సన్.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. వెనకడుగు వేసే అవకాశం వుంది.. తప్పించుకునే దారి వుంది.. ముందుకు వెళితే చనిపోతాడని తెలుసు.. అయినా వెళ్ళాడు. చావు కళ్ళల్లో చూసి.. ‘నీవు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ.. నా దేశాన్ని కాదు’ అన్నాడు” అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఉద్వేగానికి గురి చేస్తోంది. ఈ ట్రైలర్ ‘మేజర్’ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
‘మేజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. ”ఈ టీమ్ ని చూస్తే గర్వంగా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమషాల మౌనం తర్వాత శేష్ ని హాగ్ చేసుకున్నాను” అని అన్నారు.
”బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నది.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. ‘మేజర్’ టీం మొత్తం ఆ బాధ్యతను చక్కగా నిర్వహించారు. రెండేళ్ళుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన ఈ టీమ్ మొత్తానికి నేను థ్యాంక్స్ చెప్పాలి”
”జూన్ 3న ‘మేజర్’ థియేటర్లలోకి వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని అన్నారు. బ్రదర్.. నేను అసలు రిస్క్ లు తీసుకోను. నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా గా కూడా అద్భుతంగా ఉండబోతుంది.” అన్నారు
ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘మేజర్’ సందీప్ ఉన్ని కృష్ణన్ సింపుల్ మ్యాన్. అమ్మనాన్న స్నేహితులు చైల్డ్ హుడ్ క్రష్ గర్ల్ ఫ్రండ్ ఇలా మనందరిలానే అతని జీవితం కూడా సాధారణం. ఐతే అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారనేది మేజర్ లో చూస్తారు. మహేష్ గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఏం జరిగినా మహేష్ గారు వున్నారనే ఒక నమ్మకం. కోవిడ్ లాంటి కష్టకాలంలో మహేష్ నమ్రతగారే మమ్మల్ని నిలబెట్టారు. అబ్బూరి రవి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అని అన్నారు.
”మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కోరిక ఒక్కటే. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఎప్పటిక్కీ నిలిచిపోవాలని కోరుకున్నారు. మేజర్ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ సినిమా మొదలుపెట్టినపుడు పాన్ ఇండియా సినిమా.. మార్కెట్ పెంచుకోవడానికి చేస్తున్నారని కొందరు అన్నారు. కానీ అది అసలు విషయం కాదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఈ దేశం ముద్దు బిడ్డ. ఆయన మాతృ భాష మలయాళం కాబట్టి మలయాళంలో డబ్ చేశాం మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో చేశాం దేశం మొత్తం చూడాలి కాబట్టి హిందీ చేశాం. ప్రతి సీన్ షాట్ ని తెలుగు హిందీ లో షూట్ చేశాం”
”మన ఉద్దేశం సరైనప్పుడు విశ్వమే మనకు సహకరిస్తుంది. సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. అనురాగ్ శరత్ అన్నదమ్ముల్లా తోడున్నారు. ఈ సినిమాని చాలా మందికి చూపించాం. మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం కూడా ఒక స్పెషల్ షోని ప్లాన్ చేస్తాం. ట్రైలర్ తో దిమ్మతిరిగింది. సినిమా హృదయాన్ని తాకేలా వుంటుంది” అని అడివి శేష్ అన్నారు.
దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. 2018లో అడవి శేష్ ఈ కథ చెప్పారు. నేను కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై రీసెర్చ్ చేశాను. ఇలాంటి గొప్ప కథ ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకున్నాను. మహేష్ గారు మా వెనుక వుండటం ఒక ప్రత్యేకమైన బలం. నమ్రత గారు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు అని తెలిపారు.
”అడివి శేష్ తో రెండు సినిమాలు చేశాను. అతని గురించి ఒక పుస్తకం రాయొచ్చు. కష్టపడటంలో శేష్ తో పోటిపడితే చాలు మనం విజయం సాధించినట్లే. ప్రకాష్ రాజ్ రేవతి గారు అద్భుతంగా చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ ని కలిసినప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యానో.. మానిటర్ లో ప్రకాష్ రాజ్ – రేవతి గార్ల నటన చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నా యూనిట్ మొత్తానికి స్పెషల్ థ్యాంక్స్” అని శశి కిరణ్ పేర్కొన్నారు.
హీరోయిన్ సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘మేజర్’ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. మహేష్ బాబు గారికి నమ్రత మేడమ్ కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే సోనీ పిక్చర్స్ కి కూడా ధన్యవాదాలు . హీరో అడివి శేష్ దర్శకుడు శశి గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. మేజర్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఆనందంగా వుంది. ప్రతి ఒక్కరు జూన్ 3న థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
కో ప్రొడ్యుసర్ శరత్ మాట్లాడుతూ.. అడవి శేష్ ఈ సినిమా కోసం ఇరవైనాలుగు గంటలు కష్టపడ్డారు. సోనీ పిక్చర్స్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నమ్రతగారు చాలా సపోర్ట్ చేశారు. మహేష్ గారి ఒక్క మాట మాలో గొప్ప ఎనర్జీ నింపుతుంది. మహేష్ గారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం అంటూ యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు
కో ప్రొడ్యుసర్ అనురాగ్ మాట్లాడుతూ.. మహేష్ బాబు గారు ‘మేజర్’ ట్రైలర్ లాంచ్ కి రావడం ఆనందంగా వుంది. బొమ్మరిల్లు సినిమాకి మా నాన్నతో వెళ్లాను. అప్పుడే నిర్మాత అవుతానని నాన్నతో చెప్పా. ఇన్నాళ్ళ తర్వాత మహేష్ బాబుగారి లాంటి పెద్ద స్టార్ తో సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందాన్ని ఇచ్చింది. జీఎంబీ లాంటి స్టార్ బ్యానర్ ఇచ్చి మమ్మల్ని మొదటి నుండి ఇప్పటివరకూ మహేష్ బాబుగారి చేసిన సపోర్ట్ మర్చిపోలేం. మహేష్ గారు కెరీర్ మొత్తం రిస్కులు తీసుకునే జర్నీ చేశారు. మేము అంతా కొత్తవాళ్ళం. మాతో కూడా రిస్క్ తీసుకుంటారనే నమ్మకం తో ఆయన దగ్గర కి వెళ్లాం. మా నమ్మకం నిజమైయింది. ఆయన ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు అని అన్నారు.
”సోనీ పిక్చర్స్ కు థ్యాంక్స్. బ్లడ్ పెట్టి పనిచేయడం అంటే ఏమిటో అడవి శేష్ దగ్గర నేర్చుకున్నా. దర్శకుడు శశి చాలా కూల్. ఆతని బ్యాలన్స్ అద్భుతంగా వుంటుంది. హీరోయిన్ సాయి అద్భుతమైన పాత్ర చేసింది. శోభిత ధూళిపాళ్ళ నటన కూడా ఆకట్టుకుంటుంది. సినిమా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మహేష్ గారు ఈ సినిమా చూశారు. ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనే నమ్మకం వుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి ఈ చిత్రం ఘనమైన నివాళిగా వుండబోతుంది” అని అనురాగ్ చెప్పుకొచ్చారు.
Recent Random Post: