కరోనా నేపథ్యంలో థియేటర్స్ మూతబడి ఉండటంతో సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేయడం మొదలు పట్టారు. ఇతర ఇండస్ట్రీలతో పాటుగా టాలీవుడ్ లో కూడా కొన్ని క్రేజీ మూవీస్ ను థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు దర్శకనిర్మాత పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమాని.. పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడాన్ని తప్పుపట్టారు.
కాలంతో పాటుగా సాంకేతికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారడంతో తప్పులేదని.. కానీ అది అట్టడుగు వర్గానికి చేరినప్పుడే అసలైన సార్థకత ఉంటుందని నారాయణమూర్తి అన్నారు. అలానే కరోనా కష్టకాలంలో వచ్చిన ఓటీటీలను కూడా ఆహ్వానిద్దామని.. కానీ ఓటీటీల ద్వారా అట్టడు వర్గాల వారికి వినోదం అందడం లేదని.. కొద్ది శాతం మందికి మాత్రమే ఓటీటీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సేవ్ థియేటర్స్ సేవ్ ఫిల్మ్స్ అని పిలుపునిచ్చారు. ఇటీవల విడుదలైన ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలు ఉన్న కేవలం 25 శాతం మంది మాత్రమే చూడగలిగారని. మిగిలిన 75 శాతం బడుగు బలహీన వర్గాల ఇళ్లలో ఓటీటీ లేవని.. మరి అలాంటి వాళ్లకు వినోదం ఎలా అందిస్తారని ప్రశ్నించారు.
వెంకటేష్ గారి సినిమా చూడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారని.. కానీ ఓటీటీలు లేని వారు చూడలేకపోయారని అన్నారు. అందరికీ ఓటీటీలు అందుబాటులో ఉండి వినోదం అందుతున్నప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయడం తప్పు లేదని.. అప్పటి దాకా సినిమా థియేటర్స్ ఉండాల్సిందే అని నారాయణమూర్తి చెప్పారు. థియేటర్స్ లేకపోతే స్టార్స్ స్టార్ డమ్ ఉండదని.. థియేటర్లలోనే సినిమాలు చూడటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. థియేటర్లలో సినిమా చూస్తే కలిగే అనుభూతి వేరని.. సినిమా చూసిన ప్రేక్షకులు నవరసాలను ఆస్వాదిస్తారని.. ఆ ఉత్సాహం మరో విధంగా కలగదని నారాయణమూర్తి అన్నారు.
కరోనా వస్తుంది పోతుంది కానీ థియేటర్స్ మాత్రం శాశ్వతమని.. మనిషి ఉన్నంత వరకూ థియేటర్లు ఉంటాయని.. సినిమా అంటే ఓ పండగ ఓ జాతర ఓ తిరునాళ్ళు అని పీపుల్ స్టార్ అన్నారు. కరోనా నియమ నిబంధనలను పాటిస్తూనే ప్రభుత్వాలు థియేటర్లు నడపడానికి అనుమతి ఇవ్వాలని.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అలానే ఇండస్ట్రీ పెద్దలు అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుని పెద్ద సినిమాలను క్రేజ్ ఉన్న చిత్రాలను విడుదల చేస్తే జనాలు ధైర్యంగా థియేటర్స్ కు వస్తారని ఆయన తెలిపారు.
థియేటర్లో చూడాల్సిన సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తే.. మన చేతులతో మనమే థియేటర్స్ వ్యవస్థను చంపేసినట్లు అవుతుందని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ‘విరాటపర్వం’ ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీశ్’ వంటి సినిమాలు థియేటర్లలోనే విడుదల చేయాలని కోరుతున్నానని.. త్వరలోనే తన ‘రైతన్న’ సినిమాని ఆగస్ట్ 15న థియేటర్లలోనే విడుదల చేస్తానని ఆర్. నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పెద్ద సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో ని ఆర్ నారాయణ మూర్తి స్వాగతించారు. ఈ జీవో చిన్న సినిమాలకు చిన్న నిర్మాతలకు ఆశాకిరణంగా మారిందని.. దీనికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
Recent Random Post: