కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన నయన్!

నయనతారకి కాస్త అటు ఇటుగా తమ రేస్ ను మొదలుపెట్టిన చాలామంది కథానాయికలు ఆ రేస్ లో నుంచి కనిపించకుండా పోతున్నారు. నయనతార మాత్రం నాన్ స్టాప్ గా దూసుపోతోంది. సినిమాకి సినిమాకి ఆమె పారితోషికం పెరిగిపోతోంది.

ఇతర భాషల్లోను ఆమె మార్కెట్ పెరుగుతూపోతోంది. సీనియర్ స్టార్ హీరోల సరసన కాస్త నిండుగా నిబ్బరంగా బరువైన పాత్రలను పోషించాలంటే ముందుగా నయనతార పేరే పరిశీలనలోకి వస్తోంది. నయనతార ఎంత అడిగినా ఫరవాలేదు .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలనుకునే దర్శక నిర్మాతలు చాలామందినే ఉన్నారు.

ఇక నాయిక ప్రధానమైన పాత్రలను చేయడంలో నయనతారకి తిరుగులేదు. ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే మార్కెట్ అవుతుందా లేదా అనే సందేహం ఎవరికీ లేదు.

ఆమె ప్రధానమైన పాత్రలను చేసిన సినిమాలు స్టార్ హీరోల సినిమాలతో సమానంగా వసూళ్లను రాబడుతూ ఉంటాయి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల ఆమె నిర్మాతగా కూడా మారిపోయింది. విఘ్నేశ్ శివన్ తో కలిసి ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్ పై సొంతంగా సినిమాలను నిర్మిస్తోంది.

ఈ మధ్య కాలంలో ఆమె ఈ బ్యానర్ పై వరుస సినిమాలను నిర్మిస్తూ ఉండటం విశేషం. గతంలో చెన్నై కి చెందిన ‘చాయ్ వాలే’ బేవరేజ్ బ్రాండ్ లో నయనతార – విఘ్నేశ్ శివన్ కొంత పెట్టుబడి పెట్టారు. అలాగే మరికొన్ని వ్యాపారాల్లో వాళ్ల ఇన్వెస్ట్ మెంట్స్ ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే నయనతార కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డెర్మటాలజిస్ట్ అయినా రేణిత రాజన్ తో కలిసి ఆమె ఒక బ్యూటీ రిటైల్ బ్రాండ్ ను ప్రారంభించింది. ఇలా నెమ్మదిగా తన వ్యాపారాలను విస్తరిస్తూ నయనతార ముందుకు వెళుతోంది.

ఇప్పటి కథానాయికలకు ముందు చూపు ఎక్కువ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలనే విషయం వాళ్లకి బాగా తెలుసు. అందువల్లనే క్రేజ్ ఉండగానే బిజినెస్ లు మొదలుపెట్టేస్తున్నారు. కొంతమంది కథానాయికలు రెస్టారెంట్ బిజినెస్ .. మరికొందరు గోల్డ్ జ్యూయలరీ .. ఇంకొందరు డైమండ్స్ జ్యూయలరీ .. జిమ్ బిజినెస్ .. ఇలా ఎవరికి నచ్చిన బిజినెస్ లలో వారు పెట్టుబళ్లు పెడుతున్నారు.

సినిమాలు లేనప్పుడు తమకి ఆదాయం వచ్చే మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. దాహం వేసినప్పుడు బావి తవ్వుకోవడం మొదలుపెట్టకూడదనే సూత్రాన్ని బాగానే వంటబట్టించుకున్నారు.


Recent Random Post: