మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడి మనవడిగా సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘లీడర్’ సినిమాతో హీరోగా పరిచయమైన హ్యాండ్సమ్ హంక్ రానా కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన కథలు విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ కమర్షియాలిటీ కోసం పరుగులు తీయకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలలో నటిస్తున్నారు. పాత్ర నచ్చితే అది నెగెటివ్ షేడ్స్ ఉన్నది అయినా.. మరో హీరోతో కలిసి చేసే మల్టీస్టారర్ అయినా వెనకడుగు వేయడు రానా.
‘బాహుబలి’ సినిమాలో ప్రతినాయకుడు భల్లాల దేవుడు గా నటించిన రానా.. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇప్పటికే పలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన రానా.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో బీజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన రిటైర్ట్ హవల్దార్ పాత్రలో రానా కనిపించనున్నారు. ఇందులో రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.
ఫస్ట్ టైం పవన్ తో కలిసి నటిస్తుండటం గురించి.. #PSPKRana సినిమా గురించి ఇటీవల రానా స్పందించారు. ఈ చిత్రంలో తన పాత్రలో చాలా ఎమోషన్స్ ఉంటాయని.. ఇప్పటివరకు తాను చేయని రోల్ అని.. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని రానా అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు సినిమాపై ఉన్న జ్ఞానం అపార అనుబంధం చూసి ఆశ్చర్యమేసిందని.. సినిమాను ఆయన చూసే విధానం కొత్తగా ఉంటుందని రానా అన్నారు. పాత్రను పవన్ అర్థం చేసుకునే విధానం.. పాత్ర స్వభావాన్ని త్వరగా పట్టుకోవడం పవన్ కు ఉన్న గొప్ప లక్షణమని చెప్పారు. అనుభవం ఉన్న యాక్టర్స్ తో వర్క్ చేయడం వల్ల ఎన్నో నేర్చుకోవచ్చని.. పవన్ కల్యాణ్ దగ్గర నుంచైతే ప్రతి రోజూ ఓ కొత్త విషయం నేర్చుకోవచ్చని రానా అన్నాడు.
కాగా #PSPKRana చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఇకపోతే ఈ ఏడాది ‘అరణ్య’ అనే త్రిభాషా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన రానా.. ఇప్పుడు ‘విరాటపర్వం’ అనే వైవిధ్యమైన సినిమాని విడుదలకు సిద్దం చేస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. 1990ల నాటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సెట్ చేయబడింది. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ లో రానా ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారు. ‘టాప్ హీరో’ ‘దేవుడు’ ‘జంబలకిడి పంబ’ వంటి సినిమాలను నిర్మించిన ఆచంట గోపినాథ్ మరో నిర్మాత సీహెచ్ రాంబాబుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Recent Random Post: