‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో తమపై జరిగిన రాజకీయ కుట్ర గురించి పవన్ కళ్యాణ్ స్పందించలేదు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆ సినిమాని నిర్మించిన దిల్ రాజు కూడా లైట్ తీసుకున్నారు. ఏ సినిమాకీ లేని విధంగా ‘వకీల్ సాబ్’ సినిమా టిక్కెట్ల మీద వైఎస్ జగన్ సర్కార్ కక్ష కడితే, సినీ పరిశ్రమ మొత్తంగా మౌనం దాల్చింది.
హీరో నాని.. ఓ సినిమా ఫంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే, తక్కువ షోలకే అనుమతి వుంటే.. ఆ విషయమై తన ఆవేదనను వెల్లగక్కితే.. సినీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు, పవన్ కళ్యాణ్.. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో, నాని సినిమా ‘టక్ జగదీష్’ గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో హీరో నాని పడ్డ ఆవేదన గురించి మాట్లాడారు. అసలు హీరోలకి, హీరోయిన్లకీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఎలా వస్తుందో సవివరంగా పేర్కొన్నారు.
‘డాక్టర్లలా.. ఇంకొకరిలా.. మాది కూడా ఓ ప్రొఫెషన్.. మేం నటులం.. మేం న్యాయబద్ధంగా సంపాదిస్తున్నాం, పన్నులు కడుతున్నాం..’ అని గర్వంగా చెప్పగలిగారు పవన్ కళ్యాణ్. ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్, రానా పడ్డ కష్టం గురించి చెప్పారు. జూనియర్ ఎన్టీయార్ డాన్సుల గురించీ ప్రస్తావించారు. ఇవన్నీ ఎందుకు.? ఇంకెందుకు, సినీ పరిశ్రమ గౌరవాన్ని పెంచడం కోసం. సినీ పరిశ్రమ కష్టాల్ని అందరికీ తెలిసేలా చేయడం కోసం.
పవన్ కళ్యాణ్ చెయ్యాల్సింది చేశాడు. ఇక, ఇప్పుడు పరిశ్రమ తరఫున మాట్లాడాల్సినోళ్ళు మాట్లాడాలి. తమ ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వాలు అడ్డగోలుగా పన్నులు వేయొచ్చు. తమ సినిమాకి అయ్యే ఖర్చుకు తగిన విధంగా, ప్రభుత్వాల అనుమతితోనే సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకుందామనుకుంటే.. దానికి రాజకీయంగా అడ్డుపుల్ల వేయాలని ప్రభుత్వాల్ని నడుపుతున్నవారు చూస్తున్న వైనాన్ని సినీ పరిశ్రమ నిలదీయాల్సి వుంది.
తెలంగాణలో లేని సమస్య, మరో రాష్ట్రంలో లేని ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఎదురవుతుందో సినీ పరిశ్రమలోని ఓ టెక్నీషియన్ దగ్గర్నుంచి, స్టార్ హీరో వరకు.. దర్శకుడు, నిర్మాత.. ఇలా ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, అలా జరుగుతుందా.? వేచి చూడాల్సిందే.
Recent Random Post: