ఇంత ధైర్యం ఏంది సామి.. ముంగిట్లో రిలీజ్ పెట్టుకొని సీఎంపై ఈ ఫైర్ ఏంది పవనా?

ఏ మాటకు ఆ మాటే.. పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్నంత ధైర్యం ఇటీవల కాలంలో మరే రాజకీయ నేతలోనూ కనిపించదేమో. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఆర్థిక మూలాలకు దెబ్బ పడే విషయంలో మాత్రం వెనకడుగు వేసే ఇప్పటి పరిస్థితుల్లో మిగిలిన వారికి భిన్నంగా.. ఏమైతే అదే అవుతుంది.. వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించే మొండితనం పవన్ కు మాత్రమే సొంతమేమో?

ముంగిట్లో తన సినిమా రిలీజ్ ను పెట్టుకొన్న పవన్ కల్యాణ్.. నరసాపురంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైనా.. ఆయన ప్రభుత్వ విధానాలపైనా విరుచుకుపడ్డారు.

ఇప్పటికే సినిమా టికెట్ల ధరలపైన ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరితో సినీ రంగానికి చెందిన వారంతా హాహాకారాలు చేయటం.. ఈ మధ్యనే ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి.. ఆయన్ను ఎంతలా పొగిడారో.. మరెంతలా కీర్తించారో తెలిసిందే. అన్నింటికి మించిన మెగాస్టార్ చిరంజీవి అంతటి వారు.. సీఎం గారు అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడిన తీరు చూసి విస్మయానికి గురయ్యారు.

తాను తగ్గితే.. తాను ఉన్న సినిమా ఇండస్ట్రీకి మేలు జరుగుతుందన్న పెద్ద మనసుతో చిరంజీవి వినయ విధేయలతో మాట్లాడటం తెలిసిందే. అయితే.. ఇలాంటి తీరు తనకు ఏ మాత్రం సెట్ అవ్వదన్నట్లుగా ఉంది పవన్ వ్యవహారం చూస్తే. ఈ శుక్రవారం ఆయన నటించిన భీమ్లానాయక్ విడుదల కానుంది. జగన్ ప్రభుత్వం ఈ మూవీ విడుదల వేళకు ఏదైనా కీలక నిర్ణయాన్ని తీసుకునే వీలుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. జగన్ ను ఉద్దేశించి పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు.. ఆయన సినిమా వ్యాపారాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయి.

దీని వల్ల జరిగే నష్టం గురించి పవన్ కు తెలియంది కాదు. అయినప్పటికీ.. అలాంటి విషయాల్ని తాను పట్టించుకోనన్నట్లుగా భీమవరంలో ఆయన మాటల్ని చూస్తే అర్థం కాక మానదు. సినిమా.. సినిమానే.. వ్యాపారం వ్యాపారమే అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. జగన్ వ్యక్తిగత వైఖరిపై మంట పుట్టేలా మాట్లాడిన పవన్ మాటలతో జరిగే నష్టం గురించి ఆలోచించకుండా.. విరుచుకుపడం చూస్తే.. ఈ ధైర్యం నీకు మాత్రమే సాధ్యం సామీ అన్న భావన కలుగక మానదు. ముంగిట్లో సినిమా రిలీజ్ పెట్టుకొని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉతికి ఆరేసే టైపులో వ్యాఖ్యలు చేయటం పవన్ కు మాత్రమే సాధ్యం. ఆ విషయంలో మరో మాటకు తావు లేదంతే.


Recent Random Post: