టైర్ 2 హీరోలే టార్గెట్ గా కోత మొదలు పెట్టారా?


గత కొంత కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిత్ర విత్రమైన పరిస్థితులు మొదలయ్యాయి. పాన్ ఇండియా వైడ్ గా మన సినిమాకు మార్కెట్ ఏర్పడటంతో స్టార్ హీరోల్లో చాలా మంది అందుకు అనుగుణంగా రెమ్యునరేషన్ లు తారా స్థాయిలో పెంచేశారు. పాన్ ఇండియా సినిమాలు ఇంత వరకు చేయని పవన్ కల్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలు కూడా ఒక్కో ప్రాజెక్ట్ కు దాదాపు 50 కోట్ల మేర వసూలు చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో నిర్మాతలకు నిర్మాణం భారంగా మారుతూ వస్తోంది.

అయితే గత కొంత కాలంగా హీరోల రెమ్యునరేషన్లు ఇతర బడ్జెట్ లని తగ్గించుకోవాలని నిర్మాతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నా అవేవీ ఓ కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో పెరిగిన బడ్జెట్ తో పాటు రెమ్యునరేషన్ లపై కూడా చర్చించాలని టికెట్ రేట్లు ఫెడరేషన్ సమస్యలు పరిష్కారం అయ్యాకే సినిమాల షూటింగ్ లని మొదలు పెట్టాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల చెబుతూ వస్తున్నారు. అయితే నిర్మాతల మండలి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వస్తోంది.

ఇదిలా వుంటే యాక్టీవ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ మాత్రం హీరోల పారితోషికాలని తగ్గించడం వల్ల చాలా వరకు నిర్మాణ భారం తగ్గుతుందని ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇందులో భాగంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి అందులో ఆరుగురు హీరోలని మినహాయించి మిగతా హీరోల రెమ్యునరేషన్ లపై కోత విధించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ బన్నీ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ పవన్ కల్యాణ్ లను మినహాయించి టైర్ 2 హీరోలని టార్గెట్ గా మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారట.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా వుండటం గమనార్హం. ఆయనని కూడా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు టైర్ 2 హీరోల జాబితాలో చేర్చారట. టైర్ 2 హీరోల్లో నాని రవితేజ సాయి ధరమ్ తేజ్ నాగచైతన్య వైష్ణవ్ తేజ్ రామ్ తదితరులున్నారు.

మాస్ మహారాజా ఒక్కో సినిమాకు రూ. 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇక నేచురల్ స్టార్ నాని ఒక్కో మూవీకి రూ. 15 కోట్లు తీసుకుంటుండగా సాయి ధరమ్ తేజ్ రూ. 8 కోట్లు తీసుకుంటున్నారు. ముందు వీరి రెమ్యునరేషన్ లలో కోత ప్రారంభించి ఆ తరువాత స్టార్ హీరోల రెమ్యునరేషన్ లపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో గిల్డ్ సభ్యులు అడుగులు వేస్తున్నారట.

అగ్ర దర్శకులని ఈ జాబితాలో టచ్ చేయకుండా కేవలం టైర్ టు హీరోలని మాత్రమే టార్గెట్ చేయబోతుండటం గమనార్హం. ఇదిలా వుంటే ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలపై తాజాగా కామెంట్ లు వినిపిస్తున్నాయి. టాప్ 6 హీరోలతో సినిమాలు నిర్మిస్తూ టైర్ 2 హీరోల పారితోషికాలని అదుపు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా వుందని సెటైర్లు పడుతున్నాయి. ఎంతగా గిల్డ్ సభ్యులు ఒక్కతాటిపై వున్నమని చెప్పినా వ్యక్తిగత విషయాలకు వచ్చే సరికి ఎవరిది వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి.


Recent Random Post: