ఆఫర్లు లేకుంటే కాఫీ టీ ఇస్తూ ఇక్కడే ఉంటా

మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో రాజా రవీంద్ర ఎన్నో వందల సినిమాలను చేశాడు. ఆయన నటుడిగా ఇంకా ఎక్కువ సినిమాలు చేసేవాడు. కాని కొంత కాలం చిన్న పెద్ద హీరోలకు మేనేజర్ గా వ్యవహరించాడు. చాలా మంది హీరోల డేట్లను చూసే బాధ్యత రాజా రవీంద్ర చూసేవాడు. సీనియర్ హీరోల నుండి కొత్త వారి వరకు చాలా మందికి కూడా రాజా రవీంద్ర మేనేజర్ గా చేశాడు. ఆ సమయంలో ఆయన మరిన్ని సినిమాలు చేసి ఉండేవాడు. కాని ఆయన మేనేజర్ గా చేయడం వల్ల అడపా దడపా సినిమాల్లో మాత్రమే కనిపించేవాడు. ఇప్పుడు కూడా మేనేజర్ గా చేస్తున్నా కూడా నటుడిగా మళ్లీ బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆయన లుక్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ కారణంగా విలన్ గా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్న రాజా రవీంద్ర తాజాగా ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో నటించాడు. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మనో మరియు భరణిలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో భాగంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

క్రేజీ అంకుల్స్ సినిమా లో పోసాని కృష్ణ మురళి పాత్ర చాలా బాగుంటుందని అన్నాడు. ఈ సినిమా ను మొదట ఓటీటీ ద్వారా విడుదల చేయాలని అనుకున్నారు. కాని థియేటర్ల ద్వారా అయితే మరింత మందికి రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను థియేటర్ల ద్వారా రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చేంత వరకు ప్రతి ఒక్క ఆఫర్ ను చేసేందుకు సిద్దంగా ఉన్నాను. ఒక వేళ ఆఫర్లు లేకపోయినా కూడా ఇండస్ట్రీలోనే ఉండేలా ఏదో ఒక పని చేస్తాను. ఏ పని లేకుంటే కనీసం కాఫీ టీ లు అందిస్తూ అయినా ఇండస్ట్రీలోనే ఉంటాను అంటూ రాజా రవీంద్ర తనకు ఇండస్ట్రీ పై ఉన్న మక్కువను చెప్పుకొచ్చాడు.


Recent Random Post: