ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కొత్త దర్శకులకు ఒక పట్టాన అవకాశం వచ్చేది కాదు. ఎంతోకాలం పాటు వాళ్లు అలా వేచి చూడవలసి వచ్చేది. అంతగా వెయిట్ చేసినా అవకాశం వస్తుందని చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. గతంలో తమకి హిట్లు ఇచ్చిన సీనియర్ దర్శకులతో మాత్రమే సినిమాలు చేసే హీరోల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కొత్త దర్శకులతో చేయడానికి వాళ్లు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ విషయంలో రజనీ .. కమల్ అందరికంటే ముందు వరుసలో కనిపిస్తారు.
రజనీకాంత్ తన డేట్ల కోసం వెయిట్ చేస్తున్న ఎంతోమంది సీనియర్ దర్శకులను పక్కన పెట్టి యువ దర్శకుడైన పా.రంజిత్ కి ‘కబాలి’ సినిమాతో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ‘పేట’ సినిమాతో కార్తీక్ సుబ్బరాజ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాల ఫలితాల సంగతి అలా ఉంచితే ఇద్దరూ కూడా రజనీని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఆ కొత్తదనమే రజనీకి మరింత ఎనర్జీని ఇచ్చింది. అందువల్లనే ఇప్పుడు ఆయన మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడి పేరే .. ‘దేశింగ్ పెరియసామి’.
ఈ పేరు వినగానే ఇంతకుముందు ఏ సినిమా చేశాడబ్బా? అనే ఆలోచన కలగడం సహజం. తమిళంలో ఆయన చేసిన తొలి సినిమా ‘కనులు కనులను దోచాయంటే’ పేరుతో తెలుగులోనూ విడుదలైంది. దుల్కర్ – రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ ప్రశంసలను అందుకుంది. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన దేశింగ్ పెరియసామి రీసెంట్ గా రజనీని కలిసి ఒక కథను వినిపించాడట. కథ … అందులో తన పాత్ర నచ్చడంతో వెంటనే రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం రజనీ చేస్తున్న ‘అన్నాత్తే’ తరువాత ఆయన చేసే ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు.
Recent Random Post: