చెర్రీ ప్లాన్ ఛేంజ్ అయ్యింది. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో నటించాక ఆ వెంటనే శంకర్ తో మరో పాన్ ఇండియా మూవీని ప్రారంభించగా దీనికి తాజాగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. భారతీయుడు 2 పెండింగ్ చిత్రీకరణను శంకర్ పూర్తి చేయాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ఆర్.సి 15కి బ్రేక్ వేసారు.
అయితే ఇలాంటి సన్నివేశంలో చరణ్ ప్లానింగ్ ఎలా ఉండనుంది? అన్నదానిపై ఫిలింవర్గాల్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి టైమ్ కేటాయించే టైమ్ వచ్చేస్తోంది. ఈలోగానే ఆర్.సి 15 రెండో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో రామ్ చరణ్- కియారా అద్వానీలపై ఓ పాటను చిత్రీకరించారు. వచ్చే ఏడాది మధ్యలో శంకర్ సినిమా షూటింగును పూర్తి చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేసారు. ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. `భారతీయుడు 2` షూటింగ్ డిసెంబర్ లో తిరిగి ప్రారంభించేందుకు శంకర్ సిద్ధంగా ఉన్నారు.
శంకర్ కొత్త ప్లాన్ ప్రకారం ఇండియన్ 2 టాకీ పార్ట్ పూర్తి చేసి 2022 దీపావళి నాటికి సినిమాను విడుదల చేయాల్సి ఉంది. ఇక శంకర్ రాక కోసం రామ్ చరణ్ ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
కానీ ఈలోగానే చరణ్ .. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని భావించాడు. అయితే సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కానందున వెంటనే షూటింగ్ ప్రారంభమయ్యేందుకు అవకాశం లేదు.
శంకర్ సినిమా కోసం చరణ్ డేట్స్ కేటాయించడంతో గౌతమ్ 2022 ద్వితీయార్థంలో సినిమా షూటింగ్ ప్రారంభించాలనుకున్నాడు. దానివల్ల స్క్రిప్ట్ పని ఆలస్యమైంది. దీంతో రామ్ చరణ్ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మారిన షెడ్యూల్ ని బట్టి.. ఇప్పుడు వచ్చే ఏడాది శంకర్ – గౌతమ్ తిన్ననూరిలతో సినిమాల్ని ఒకేసారి షూట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఏదైనా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.
Recent Random Post: