మాస్ మహారాజా రవితేజ లైన్లో పెట్టిన ఆసక్తిరమైన ప్రాజెక్ట్స్ లో ”రామారావు ఆన్ డ్యూటీ” ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ మరియు ‘కర్ణన్’ భామ రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘బుల్ బుల్ తరంగ్’ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘సొట్ట బుగ్గల్లో’ అనే రెండో సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు శ్యామ్ సిఎస్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ ఇది.
అందమైన లొకేషన్స్ లో రవితేజ మరియు దివ్యాంశ కౌశిక్ లపై చిత్రీకరించబడింది. ‘నేనేనా నేనేనా.. నిన్నా మొన్నా ఉన్నది మరి నేనేనా.. నిన్నేనా నిన్నేనా.. ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా..’ అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. ఈ మెలోడీ గీతంలో హీరోహీరోయిన్ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. ఇందులో మజిలీ బ్యూటీని మాస్ రాజా ముద్దులతో ముంచెత్తారు. ఇద్దరి మధ్య కొన్ని ఘాడమైన లిప్ లాక్స్ చూడొచ్చు.
‘సొట్ట బుగ్గల్లో’ పాటలో రవితేజ స్టైలిష్ గా కనిపించగా.. దివ్యాన్ష చీరలో అందంగా కనిపించింది. ప్రధాన జంట వేసిన సింపుల్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా.. సింగర్స్ హరి ప్రియ – నకుల్ కలిసి ఈ గీతాన్ని ఆలపించారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. నాజర్ – సీనియర్ నరేష్ – పవిత్ర లోకేష్ – ‘సర్పట్ట’ జాన్ విజయ్ – చైతన్య కృష్ణ – తనికెళ్ల భరణి – రాహుల్ రామకృష్ణ – ఈరోజుల్లో శ్రీ – మధు సూదన్ రావు – సురేఖ వాణి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Recent Random Post: