
కొన్ని సినిమాలు ఎప్పుడో ప్రారంభమై చాలా కాలం తర్వాతే పూర్తవుతాయి. అయితే ఆ ఆలస్యం నాణ్యత కోసం జరిగితే బాగానే ఉంటుందిగానీ, కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కూడా సినిమాలు లేట్ అవుతుంటాయి. అలా ఎక్కువ కాలం సెట్స్‌పై కొనసాగుతున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతుంది.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న గూఢచారి 2 కూడా అలాంటి ప్రాజెక్ట్‌గానే మారింది. ప్రస్తుతం ఆయన డెకాయిట్ అనే రొమాంటిక్ డ్రామాతో పాటు గూఢచారి 2 సినిమాను కూడా చేస్తున్నారు. వీటిలో డెకాయిట్ వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుండగా, గూఢచారి 2 మాత్రం ఇంకా కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.
మొదటి భాగం విజయవంతమైన తర్వాత గూఢచారి 2 కోసం ప్రేక్షకులతో పాటు విమర్శకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఎందుకు ఇంత టైమ్ పడుతుందనే ప్రశ్నకు సమాధానంగా శేష్ స్పష్టత ఇచ్చారు. తాను ఎప్పుడూ సినిమాలను సమయాన్ని తీసుకొని, పూర్తి కట్టుదిట్టంగా చేస్తానని ఆయన తెలిపారు.
“మేజర్ సినిమా సమయంలో కూడా నేను ఇంతే టైమ్ తీసుకున్నా. కానీ అప్పుడు కోవిడ్ కారణంగా లేట్ అయ్యిందనుకున్నారు. గూఢచారి కోసం కూడా నాకు రెండేళ్లు పట్టింది. నాకు వేగం కంటే క్వాలిటీ ముఖ్యం. ప్రేక్షకులు గుర్తుంచుకునే సినిమాలు చేయడమే నా లక్ష్యం,” అని శేష్ చెప్పారు.
అలాగే సినిమా ఆలస్యమవుతున్నా, దాని వల్ల నిర్మాతలకు అదనపు ఖర్చు కాకుండా చూసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. తన ప్రతి సినిమా ఆలోచనాత్మకంగా, సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలని శేష్ మరోసారి నొక్కిచెప్పారు.
Recent Random Post:














