
టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే తప్పకుండా అందులో ఏదో స్పెషల్ కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడింది. నిర్మాత నాగ వంశీ ఇప్పటికే పలు విజయాలతో తన సత్తాను చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బ్యానర్ నుంచి సంక్రాంతి కానుకగా అనగనగా ఒక రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నవీన్ పోలిశెట్టి హీరోగా, దర్శకుడు మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేయగా, వాటిలో నిర్మాత నాగ వంశీ స్వయంగా పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాగ వంశీ… అనగనగా ఒక రాజు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. అయితే ఇది పండుగ సీజన్ కావడంతో సినిమా ఏ రేంజ్‌కు వెళ్తుందనేది పండుగ వాతావరణం, థియేటర్ ఆక్యుపెన్సీ, అలాగే మిగిలిన సినిమాల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. సినిమాలో నవీన్ పోలిశెట్టి కామెడీ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో పాటు కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా వర్క్ అవుతాయని వంశీ పేర్కొన్నారు.
ఏ పరిస్థితుల్లోనూ అనగనగా ఒక రాజు సక్సెస్ అవుతుందన్న నమ్మకం తనకు 200 శాతం ఉందని నాగ వంశీ స్పష్టం చేశారు. గతేడాది సెకండ్ హాఫ్ తనకు ఆశించినంతగా కలిసి రాలేదని, తాను మాట్లాడిన కొన్ని మాటలే మిస్‌ఫైర్ అయ్యాయని అంగీకరించారు. ఇకపై తన సినిమాల విషయంలో మాటలకంటే కంటెంట్‌నే మాట్లాడనివ్వాలనుకుంటున్నానని, అందుకే రిలీజ్‌కు ముందు ఎక్కువగా మాట్లాడబోనని తెలిపారు.
గతంలో నాగ వంశీ తన బ్యానర్ నుంచి వచ్చే కొన్ని సినిమాలపై ఓవర్ హైప్ ఇచ్చి మాట్లాడగా, అవి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఆ అనుభవాల నేపథ్యంలోనే ఈసారి ఆయన చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recent Random Post:















