
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘అర్జున్ S/o వైజయంతి’ టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన స్పందన పొందింది. తల్లి-కొడుకు బంధం, ఇంటెన్స్ ఎమోషన్, పవర్ఫుల్ యాక్షన్ మోడ్‌లో రూపొందించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మల్టీ-జానర్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం విభిన్నమైన కథను అందించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీజర్ అందుకున్న రెస్పాన్స్‌ను చూస్తే, సినిమా మీద అంచనాలు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ నటులు సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో అసలైన హైలైట్ – నేషనల్ అవార్డు విన్నర్ విజయశాంతి కీలక పాత్రలో నటించడం. గతంలో ఆమె చేసిన ‘కర్తవ్యం’ వంటి లెజెండరీ సినిమాల గుర్తులు ఇందులో కనిపించేలా కథను మలిచినట్లు తెలుస్తోంది.
‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతి పోషించిన ధైర్యవంతమైన పోలీస్ అధికారి పాత్ర ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయేలా ఉంది. ఇప్పుడు ‘అర్జున్ S/o వైజయంతి’ లో కూడా ఆమె పాత్రకు అదే స్థాయిలో ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, “కర్తవ్యం సినిమాలోని విజయశాంతి పాత్రకు ఒక కుమారుడు ఉంటే ఎలా ఉండేదనే పాయింట్ ఆధారంగా ఈ కథను అభివృద్ధి చేశాం” అని వెల్లడించారు.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, విజయశాంతి కుమారుడిగా కనిపించనున్నాడు. తల్లి-కొడుకు మధ్య బలమైన భావోద్వేగాల నేపథ్యంలో కథ నడవనుంది. వీరి అనుబంధాన్ని దూరం చేసే ప్రధాన సంఘటన ఏమిటనేది కథలో కీలకమైన అంశంగా మారనుంది. “నిజజీవితంలో కూడా విజయశాంతి గారిని ‘అమ్మ’ అని పిలుస్తాను” అనే కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు సినిమా మీద మరింత ఆసక్తిని పెంచాయి.
అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బాలుసు, అశోక్ వర్ధన్ ముప్పా, కళ్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్నారు. టీజర్ చూస్తే యాక్షన్, ఎమోషన్ కలబోసిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. సమ్మర్ రిలీజ్‌ను లక్ష్యంగా పెట్టుకున్న మేకర్స్, విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటనను త్వరలోనే ఇవ్వనున్నారు.
Recent Random Post:















