అల్లు అరవింద్ తల్లి కన్నుమూత

Share


టాలీవుడ్‌ అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు రామలింగయ్య గారి సతీమణి, అల్లు అరవింద్ తల్లి, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నానమ్మ అయిన అల్లు కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారుజామున వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె మృతితో అల్లు కుటుంబం, మెగా కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

కనకరత్నమ్మ మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఇతర కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుని పరామర్శించారు. అల్లు అర్జున్ ముంబైలో షూటింగ్‌లో ఉండగా, ఆ వార్త తెలిసి వెంటనే హైదరాబాద్‌కి చేరుకున్నారు. నానమ్మను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సమయంలో తీవ్ర దుఃఖంలో ఉన్న బన్నీని చిరంజీవి ఓదార్చడం హృదయానికి హత్తుకునేలా మారింది.

దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బీవీఎస్ రవి తదితర సినీ ప్రముఖులు కూడా అరవింద్ కుటుంబాన్ని పరామర్శించి, కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, బన్నీ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కనకరత్నమ్మ, అల్లు రామలింగయ్య గారికి నలుగురు సంతానం. వారిలో కుమారుడు అల్లు అరవింద్ టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. కుమార్తెల్లో ఒకరైన సురేఖ మెగాస్టార్ చిరంజీవి జీవిత భాగస్వామిగా మారారు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు వసంతలక్ష్మి, నవభారతి సినీ రంగం, సోషల్ మీడియాలోనూ దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.

ఇప్పుడు కనకరత్నమ్మ మరణం వారందరినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. తల్లితో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


Recent Random Post: