ఆది పినిశెట్టి ‘శబ్దం’ ఎలా ఉంది

Share


సరైనోడు చిత్రంలో విలన్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి, గడిచిన ఏళ్లలో మలుపు, ఏకవీర వంటి సినిమాల్లో హీరోగా కనిపించినప్పటికీ, నిజమైన గుర్తింపు బన్నీకి ప్రతినాయకుడిగా నటించాకే వచ్చింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత, శబ్దం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సౌండ్ థ్రిల్లర్ మీద భయంకరమైన సినిమాలను ప్రేమించే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత హైప్‌ను పెంచింది. అంతేకాక, వైశాలి తర్వాత ఈ జానర్‌లో మరో ఇంట్రెస్టింగ్ సినిమాగా కనిపించడంతో, ఓ వర్గం ప్రేక్షకులు దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఓపెనింగ్స్ మాత్రం ఊహించిన స్థాయిలో రాలేదు.

కథ పరంగా చూస్తే, దర్శకుడు అరివజగన్ వెంకటాచలం ఓ వైవిధ్యమైన పాయింట్ ఎంచుకున్నాడు. మన్నార్ కొండ ప్రాంతంలోని ఓ కాలేజీలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. వీటి వెనుక అసలు కారణాలు తెలుసుకునేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమా (ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. అలా అన్వేషణలో తలమునకలై, కాలేజీ పాత లైబ్రరీలో నలభై రెండు ఆత్మలు ఉన్నట్లు గుర్తిస్తాడు. ఆత్మల వెనుక గల డయానా (సిమ్రాన్) కథ తెలియడంతో అసలు మిస్టరీ మొదలవుతుంది. కాలేజీ భవనంలో ఈ హత్యలు ఎలా జరిగాయి? ఎవరు చేయించారు? ఇంత పెద్ద కుట్రకు కారణమైన నిజమేంటి? అనే ప్రశ్నలకు సమాధానం శబ్దం కథనం అంతా.

ఫస్ట్ హాఫ్ వరకు ఓ మోస్తరు సస్పెన్స్, థ్రిల్ మైంటైన్ చేసిన ఈ సినిమా, సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్ నుంచి లయ తప్పింది. టెక్నికల్‌గా టీమ్ పని మెచ్చుకోదగినదే అయినా, భయపెట్టే ఎలిమెంట్స్ లోపించడంతో కథనం ఆసక్తి తగ్గింది. ప్రీ-క్లైమాక్స్‌లో ఇచ్చిన విలన్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా లేదని చెప్పాలి. స్క్రీన్‌ప్లే కూడా వైశాలి స్థాయిలో gripping లేకపోవడం శబ్దం అనుభూతిని తగ్గించేసింది.

తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ, కెరీర్ బెస్ట్ అనిపించలేదు. క్యాస్టింగ్‌లో కొన్ని తప్పులు జరిగినట్లు అనిపించింది. హారర్ సినిమాలను విపరీతంగా ఇష్టపడే ప్రేక్షకులకు కొంత నచ్చొచ్చేమోగానీ, అందరికీ ఈ శబ్దం చేరడం కష్టమే.


Recent Random Post: