ఆర్ఆర్ఆర్ కాన్సర్ట్‌లో తారక్‌కు అసహనం, అభిమానులతో ఉద్రిక్తత

Share


‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ గ్లామరస్ ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి సినిమాకు చెందిన గీతాలను ఆలపించగా, దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఒకే వేదికపై దర్శనమిచ్చారు.

ఈ ఈవెంట్‌లో చరణ్‌–తారక్‌ల మధ్య కనిపించిన ఆత్మీయత అభిమానుల మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా చరణ్ తారక్‌ను హత్తుకొని ముద్దుపెట్టిన దృశ్యం అభిమానులకు ఎమోషనల్ హైపైట్‌గా నిలిచింది. ఎన్నో రోజుల తర్వాత ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో, సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. రెండు వేర్వేరు సినీ కుటుంబాలకు చెందినప్పటికీ ఇద్దరూ గాఢమైన స్నేహాన్ని చాటడం అభిమానులను ఉర్రూతలూగించింది.

‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కిన నేపథ్యంలో ఈ లైవ్ కాన్సర్ట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఈ ఉత్సాహభరిత వేడుకలో ఓ చిన్న సంఘటన మాత్రం తారక్‌ను అసహనానికి గురిచేసింది. కార్యక్రమం ముగిశాక బయటకు వచ్చిన ఎన్టీఆర్‌ను సెల్ఫీ కోసం అభిమానులు చుట్టుముట్టిన ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. తారక్ ఎంతగానో శాంతంగా, సున్నితంగా స్పందిస్తూ “అందరికి సెల్ఫీలు ఇస్తా, కానీ ఇలా ఎగబడితే భద్రతా సిబ్బంది బయటకు పంపాల్సి వస్తుంది” అని చెప్పినా వినిపించుకోలేదు.

ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా సిబ్బంది ఎన్టీఆర్‌ను అక్కడి నుంచి తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు అభిమానులు “ఇది మేము ప్రేమతో చేశాం” అంటుండగా, మరికొందరు మాత్రం “వారిని ప్రేమిస్తే గౌరవం కూడా ఇవ్వాలి” అని అభిమానులకు బాధ్యత గుర్తుచేస్తున్నారు.

తారక్ అభిమానుల పట్ల చూపిన సహనం, ప్రేమ ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి రుజువు చేసింది. అయితే ఇలాంటి వేళల్లో అభిమానులు మరింత ఓర్పు, శాంతాన్ని పాటిస్తే, ఇలాంటి ఇబ్బందులు ఎవరికి రాకుండా ఉంటాయన్నది నెటిజన్ల అభిప్రాయం.


Recent Random Post: