ఇమేజ్‌ని బుర్ర‌కెక్కించుకోవ‌ద్దు.. విశాల్‌కి హైకోర్ట్ సూచ‌న‌

హీరో విశాల్ పై లైకా ప్రొడ‌క్ష‌న్స్ కోర్టుల ప‌రిధిలో పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో కోర్టు వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌గా మారాయి. ఇంత‌కీ కోర్టు ఏమందంటే..? మీ ఇమేజ్‌ను బుర్ర‌కెక్కించొచుకోవద్దు! అని మద్రాస్ హైకోర్టు హీరో విశాల్ కు అక్షింత‌లు వేసింది. కోర్టు ఆదేశాలను పాటించడంలో తన ఆస్తి వివరాలను దాఖలు చేయడంలో విఫలమైనందుకు అతడిని కోర్టు తప్పు ప‌ట్టింది. మీరు అందరిలాగే ఉన్నారు. మీరు ఈ కోర్టుకు వచ్చినప్పుడు లిటిగెంట్ !అని జస్టిస్ పిటి ఆశా శుక్రవారం నాటి విచార‌ణ‌లో అన్నారు. విశాల్‌ చెల్లించాల్సిన రూ. 21.9 కోట్ల రికవరీ కోసం లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన దావాను విచారిస్తున్నప్పుడు కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

కోర్టు సూచించిన విధంగా విశాల్ కోటి డిపాజిట్ చేయాల్సి ఉండ‌గా.. న్యాయమూర్తి విశాల్ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం కోసం అతడి ఆస్తుల జాబితాతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. అయితే గ‌తంలో ఓమారు విశాల్ అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైనందున విశాల్ న‌టించిన మార్క్ అంటోని సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన విశాల్ ఇచ్చిన హామీని అనుసరించి, న్యాయమూర్తి స్టేను తొల‌గించి అఫిడవిట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇచ్చారు. శుక్రవారం ఈ పిటిషన్ తదుపరి విచారణకు రాగా, కోర్టు దానిని ఉపసంహరించుకుంది. పదేపదే హెచ్చరించిన తర్వాత కూడా అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైనందుకు నటుడు విశాల్ పై కోర్టు సీరియ‌స్ అయింది. వాస్తవానికి ఆన్‌లైన్ ఫైలింగ్ విధానంలో తాను అఫిడవిట్‌ దాఖలు చేశానని విశాల్‌ తెలిపారు. తనకు 28 రోజుల సినిమా షూటింగ్ ఉన్నందున, ఈ కేసులో తాను హాజరుకాలేన‌ని కోర్టును అభ్యర్థించాడు. కానీ కోర్టు అతని వ్యక్తిగత అభ్య‌ర్థ‌న‌ను తిరస్కరించింది. అతడికి సంబంధించిన‌ అన్ని ఆస్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇచ్చింది.

సెప్టెంబరు 15న థియేటర్లలో విడుదలైన `మార్క్ ఆంటోని` సానుకూల సమీక్షలను అందుకోవడంతో విశాల్ తిరుపతిని సందర్శించారు. నటుడు తిరుపతి ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందారు . మొత్తం సిబ్బంది చేసిన కృషికి విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అయిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. విడుదలకు ముందు వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ, ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం విడుదలైంది.థియేటర్లలో మొదటి రోజు రూ. 6.5 కోట్లు వసూలు చేసింది. తొలి మూడు రోజుల్లో 20కోట్లు పైగా వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అస‌లు లైకాతో గొడ‌వేంటి?

విశాల్ సొంత నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్ అన్బుచెజియన్ కు చెందిన గోపురం ఫిల్మ్స్ నుండి 21.29 కోట్ల అప్పు తీసుకున్నాడు. అయితే ఈ మొత్తాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. అయితే ఈ మొత్తాన్ని విశాల్ తిరిగి చెల్లించేవరకు అతని అన్ని సినిమా హక్కులను లైకాకు ఇవ్వాలనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి వీరమే వాగై చూడం సినిమాను విడుదల చేసినందుకు విశాల్‌పై లైకా ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసులో ప్ర‌స్తుతం విచార‌ణ సాగుతోంది.కోర్టు ఆదేశాల మేరకు పత్రాలు దాఖలు చేయనందున విశాల్‌పై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదని న్యాయమూర్తి ప్రశ్నించారు. విశాల్ తనను కోర్టు కంటే పెద్దగా భావించకూడదు. కోర్టు ముందు అందరినీ సమానమేన‌ని న్యాయమూర్తి అన్నారు.


Recent Random Post: