“కథే ప్రాణం.. యంగ్ డైరెక్టర్లకు సురేష్ బాబు బలమైన సందేశం”

Share


తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తాజాగా ఈషా మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొని పరిశ్రమపై, ముఖ్యంగా యంగ్ డైరెక్టర్లు మరియు స్టోరీ రైటర్ల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా ఒక కొత్త దర్శకుడు లేదా రచయిత తన కథను తెరకెక్కించాలంటే నిర్మాతలు, హీరోల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తుందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ అంశాన్ని ప్రస్తావించిన సురేష్ బాబు, ఈ కష్టం ఇప్పటి కాలానికే పరిమితం కాదని, గత తరాల నుంచే కొనసాగుతోందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“చాలా మంది యంగ్ డైరెక్టర్లు, స్టోరీ రైటర్లు స్క్రిప్ట్ పట్టుకుని ఐదారు సంవత్సరాలు నిర్మాతలు, హీరోల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. ఈ పరిస్థితి ఈరోజు మొదలైనది కాదు. మా నాన్న డి. రామానాయుడు గారు సినిమాలు నిర్మించే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది,” అని అన్నారు.

తన తండ్రి మొదటి సినిమా సందర్భాన్ని గుర్తు చేసుకున్న సురేష్ బాబు, “మా నాన్న మొదటి సినిమాకు డైలాగ్స్ రాయడానికి నరసరాజు గారిని ఫిక్స్ చేశారు. అయితే కథ కోసం చాలా కాలం వెతికారు. ఎవరూ కథ చెప్పలేదు. ఒకరోజు బీచ్‌లో కూర్చున్నప్పుడు నరసరాజు గారు చెప్పిన కథే రాముడు – భీముడు. ఆ కథను ఆయన ముందు చాలా చోట్ల చెప్పారు కానీ రిజెక్ట్ అయ్యింది. కానీ మా నాన్నకు ఆ కథ నచ్చి, ఎన్టీఆర్ గారికి వినిపించగా ఆయన ఓకే చెప్పారు. అలా ఆ సినిమా తెరకెక్కింది,” అని వివరించారు.

ఈ ఉదాహరణను ఉద్దేశిస్తూ, “కష్టపడితేనే సక్సెస్ తలుపు తడుతుంది. స్క్రిప్ట్ రైటర్లు, దర్శకులు ఈ స్థాయిలో పోరాడితేనే అవకాశాలు వస్తాయి,” అని సురేష్ బాబు పేర్కొన్నారు.

అలాగే, యంగ్ టాలెంట్‌కు ప్రోత్సాహం ఇస్తూ,
“ఎవరెన్ని సార్లు రిజెక్ట్ చేసినా హోప్స్ వదులుకోకండి. మీ కథకు ఒక రోజు కచ్చితంగా విలువ వస్తుంది. పోరాటం కొనసాగించండి,” అంటూ నూతన దర్శకులు, రచయితలకు పిలుపునిచ్చారు.

ఇక మరోవైపు, కథాబలం లేకుండా తెరకెక్కుతున్న సినిమాల వల్లే సినీ పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. “ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడం లేదు. పరిశ్రమే వారిని దూరం చేస్తోంది. మంచి కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. దీనికి కోర్ట్, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలే నిదర్శనం,” అని తెలిపారు.

కథాబలం లేని సినిమాల వల్ల పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సురేష్ బాబు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Recent Random Post: