కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకి పోలీసు నోటీసులు

Share


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు, ప్రముఖ హీరో మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు కిడ్నాప్ కేసులో నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు, 15 రోజుల్లోగా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళ్తే… తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పలు విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతుండగా, మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు ఇద్దరు విద్యార్థి నేతలను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనలో అక్బర్, వినోద్ అనే విద్యార్థి నేతలపై బౌన్సర్లు దాడి చేశారంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ కారును వెంబడించి, ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.

ఈ కేసులో ఫిబ్రవరి 3న మొత్తం 13 మందిపై కిడ్నాప్ కేసు నమోదు కాగా, అందులో మోహన్ బాబు, మంచు విష్ణు, పీఆర్ఓ సతీష్ పేర్లు కూడా ఉన్నాయి. తాజాగా, ఈ కేసుకు సంబంధించి తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు.

దీనిపై స్పందించిన మంచు విష్ణు, ఇప్పటికే తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ఖరారయ్యాయని, ఫిబ్రవరి 15 తర్వాత విచారణకు హాజరవుతానని లిఖితపూర్వకంగా పోలీసులకు తెలియజేశారట. దీంతో కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు రావడం మరింత సంచలనంగా మారింది.

ఈ కేసులో ఏ1గా పీఆర్ఓ సతీష్, ఏ2గా మంచు విష్ణు, ఏ3గా మంచు మోహన్ బాబు పేర్లను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

తమపై కావాలనే కొంతమంది కుట్ర పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా, సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారి తీస్తోంది.


Recent Random Post: