
డైరెక్టర్లు ఎప్పుడూ తమ మనసులో ఒక ఆలోచనతో సినిమా మొదలు పెడతారు. కానీ పరిస్థితులు, నిర్మాతలు, హీరోల డిమాండ్లు కారణంగా ఆ ఆలోచన మారిపోవడం సహజం. అయితే కొందరు మాత్రమే తాము నమ్మిన కథను ఎలాంటి రాజీ లేకుండా చూపించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. అలాంటి వారిలో లోకేష్ కనగరాజ్ ఒకరు.
ప్రస్తుతం లోకేష్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకొని A సర్టిఫికేట్ పొందింది. ఈ విషయం చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్‌లో ప్రకటించగానే అభిమానులు మరియు సినీ వర్గాలు ఆశ్చర్యపోయారు.
రజినీ 50 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఏ సినిమాకూ A సర్టిఫికేట్ రాకపోవడం విశేషం. కూలీతో ఆ రికార్డ్ బ్రేక్ అయింది. ఈ కారణంగా అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ దాటుతుందని అనుకున్న సమయంలో, A సర్టిఫికేట్ రావడం ఆ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలి కాలంలో రిలీజ్ చేసిన రెండు పోస్టర్లు కూడా సినిమాకి గట్టి యాక్షన్, వయోలెన్స్ ఉండబోతుందని స్పష్టంగా చూపించాయి. కుటుంబ ప్రేక్షకులకు కంటే యూత్, యాక్షన్ లవర్స్ కోసం రూపొందించారని అవి సూచిస్తున్నాయి.
ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్, “నాకు బాక్సాఫీస్ కలెక్షన్లు కన్నా ప్రేక్షకులు నన్ను నమ్మి కొనే ₹150 టికెట్ విలువైనది. అందుకే 1000 కోట్ల క్లబ్ గురించి ఆలోచించను. నేను తీసే సినిమాల్లో ఎక్కడా రాజీపడను, వయోలెన్స్ విషయంలో కూడా కాదు” అని స్పష్టం చేశారు.
అందుకే కూలీకి A సర్టిఫికేట్ వస్తుందని ఆయన ముందుగానే తెలుసు. ఆయన దానికి కట్టుబడి ఉండి తన స్టైల్లోనే సినిమా తీశారని అర్థమవుతోంది. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.
Recent Random Post:















