జయా బచ్చన్ వ్యాఖ్యలు: టాయిలెట్ హిట్ సినిమా పై వివాదం!

Share


బాలీవుడ్ ప్రముఖుల వ్యాఖ్యలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి ప్రముఖ నటి జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ” అనే సినిమా టైటిల్ తనకు అస్సలు నచ్చలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పేరు ఉన్న సినిమాను ఎంత మంది చూస్తారనే ప్రశ్నను ఆమె ప్రేక్షకులకు సంధించగా, కేవలం కొంతమంది మాత్రమే చేతులు ఎత్తడంతో “చూశారా, ఇక్కడే ఇలాంటి స్పందన వస్తే ఈ సినిమా ఫ్లాప్” అంటూ తేల్చేశారు.

అయితే, వాస్తవానికి టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సూపర్ హిట్ మూవీ. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల లేమి కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాన కథాంశంగా తీసుకుని, వినోదాత్మకంగా దర్శకుడు శ్రీనారాయణ్ సింగ్ తెరకెక్కించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియానంను ప్రోత్సహించేలా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. అందులోని సామాజిక సందేశాన్ని గమనించినవారు సినిమా గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు.

అలాంటి విజయం సాధించిన చిత్రాన్ని ఇలా బహిరంగ వేదికపై “ఫ్లాప్” అని వ్యాఖ్యానించడం పట్ల నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “కోడుకు అభిషేక్ బచ్చన్ స్టార్ కాలేకపోయాడనే అసంతృప్తితో జయా బచ్చన్ ఇలా మాట్లాడి ఉండొచ్చేమో” అని కొందరు విమర్శిస్తుండగా, “టాయిలెట్ సినిమాను అసలు చూసి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయలేరు” అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా, తొమ్మిదేళ్ల కిందట విడుదలైన సినిమా గురించి ఇప్పుడే ప్రస్తావిస్తూ దానిని ఫ్లాప్‌గా లేబుల్ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమై ఉంటుందో అన్నది మాత్రం తెలియదన్నమాట!


Recent Random Post: