టెంపర్ – ఎన్టీఆర్ కెరీర్‌ను మార్చిన సినిమా!

Share


ప్రతి హీరో కెరీర్‌లో కొన్ని సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జూ. ఎన్టీఆర్ కెరీర్‌లో అలా ప్రత్యేకమైన సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే చిత్రం “టెంపర్”. ఈ సినిమా ప్రారంభమైన క్షణమే చిరస్మరణీయమైనది. దర్శకుడు పూరీ జగన్నాథ్, “ఇది మీ ఎన్టీఆర్ కాదు, మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు” అని చెప్పినప్పుడు, ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కి “మీరు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తా” అని మాట ఇచ్చినప్పుడు – ఆ క్షణాల్లోనే ఈ సినిమా గొప్పతనాన్ని ముందుగా ప్రకటించేసింది.

ఎన్టీఆర్ కెరీర్‌ను చూస్తే, “టెంపర్” ముందు – టెంపర్ తర్వాత” అని చెప్పేంతగా ఈ సినిమా ప్రభావం ఉంది. టెంపర్‌కు ముందు ఎన్టీఆర్ నాలుగు ఏళ్ల పాటు వరుసగా ఫ్లాపులు చూశాడు. ఆ కాలంలో ఆరు సినిమాలు చేసినా, “బాద్‌షా” తప్ప మిగతావన్నీ నిరాశపరిచాయి. “రామయ్యా వస్తావయ్యా”, “రభస” వంటి సినిమాలు ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.

అలాంటి క్లిష్టమైన సమయంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “టెంపర్” ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపుతిప్పింది. పూరీ కూడా అప్పటికి వరుస ఫ్లాపుల్లోనే ఉండడంతో, ఈ సినిమాపై తొలుత పెద్దగా అంచనాలు లేవు. అంతేకాదు, ఎన్టీఆర్ – పూరీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన “ఆంధ్రావాలా” ఫ్లాప్ కావడంతో ఎవరికీ పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ “టెంపర్” టీజర్ రిలీజ్‌ అయినప్పుడే అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

సినిమా విడుదలయ్యాక ఎన్టీఆర్ అసలైన ఆగమనం చూపించాడు. పూరీ చెప్పినట్టే, “టెంపర్”తో కొత్త ఎన్టీఆర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఎన్టీఆర్ ఓవర్‌దటాప్ ఎనర్జీ, తనదైన డైలాగ్ డెలివరీ, విభిన్నమైన పాత్ర తీరు – ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చింది. సినిమా చూసిన ఫ్యాన్స్ గర్వంతో కాలర్ ఎగరేశారు. అప్పటినుంచి ఎన్టీఆర్ ప్రతి సినిమాతో ఫ్యాన్స్‌ను అదే స్థాయిలో గర్వపడేలా చేయడం కొనసాగిస్తున్నాడు.

ఫిబ్రవరి 13, 2015 న విడుదలైన “టెంపర్” ఇవాళ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన “నాన్నకు ప్రేమతో”, “జనతా గ్యారేజ్”, “జై లవకుశ”, “అరవింద సమేత”, “ఆర్ఆర్ఆర్”, “దేవర” – అన్నీ హిట్లే.

కేవలం ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులకూ “టెంపర్” ఎంతగానో నచ్చిన సినిమా. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిపోయింది.


Recent Random Post: