తిరుమలలో శివజ్యోతి వ్యాఖ్యలు పెద్ద దుమారం

Share


సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ కాలంలో, ప్రజాదరణ ఉన్న వ్యక్తులు మాట్లాడే ప్రతి పదం, చేసే ప్రతి చర్య పెద్ద వివాదాలకే దారి తీయగలవు. అదే ఇప్పుడు న్యూస్ ప్రెజెంటర్ మరియు యాంకర్ శివజ్యోతి విషయంలో జరిగింది. తిరుమలలో దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడిన సమయంలో ఆమె, ఆమె భర్త చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర ప్రతికూలతను రాబట్టాయి.

శివజ్యోతి కుటుంబసభ్యులతో కలిసి ఇటీవల తిరుమలలో దర్శనం కోసం వెళ్లింది. ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది అందించే ప్రసాదం తీసుకుంటూ చేసిన సెల్ఫీ వీడియోలో, “మేము కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం… మేమే రిచెస్ట్ బిచ్చగాళ్లు” అంటూ ఆమె, ఆమె భర్త వ్యాఖ్యానించిన మాటలు భక్తుల భావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. సరదాగా చేసిన వ్యాఖ్యలైనా, వాటిని పునరావృతం చేస్తూ వీడియోలో కనిపించడం వివాదాన్ని మరింత పెంచింది.

పవిత్రమైన తిరుమల క్షేత్రం, శ్రీవారి ప్రసాదం వంటి విషయాలపై ఇలా మాట్లాడటం సరైంది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలు, దేవుళ్లపై కామెంట్‌లు చేయడం ఫ్యాషన్ అయిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివజ్యోతి బహిరంగ క్షమాపణ చెప్పడంతోపాటు ఆమెపై టీటీడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో ఆమె ఇమేజ్‌కు నష్టం వాటిల్లిన నేపథ్యంలో, తాజా వివాదం శివజ్యోతి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశముంది.


Recent Random Post: