ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వుండేది. ఇది చరిత్ర. దీన్ని చెరిపేయడానికి వీల్లేదు. తమిళులకి ప్రాంతీయాభిమానం కాస్త ఎక్కువే. ఆ మాటకొస్తే, ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం మీద మక్కువ వుండడం సహజమే కదా.! కానీ, కొందరుంటారు.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి. ఆ కొందరే ఇప్పుడు ‘తమిళ్ వర్సెస్ తెలుగు’ అంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద హ్యాష్ ట్యాగ్స్‌ని ట్రెండింగ్‌లో వుంచుతున్నారు.
తెలుగువారంటే.. ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే కాదు, తెలంగాణకి చెందినవారు కూడా. ఆంధ్రోళ్ళు, తెలంగాణోళ్ళు.. తమని దోచుకుంటున్నారంటూ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన సోకాల్డ్ తమిళులు, సోషల్ మీడియా వేదికగా నానా యాగీ చేసేస్తున్నారు. ‘మా తమిళనాడులోనే కాదు, మీ కర్నాటకలో కూడా తెలుగువారి దోపిడీ కొనసాగుతోంది..’ అంటూ కన్నడిగుల్నీ రెచ్చగొడ్తున్నారు కొందరు తమిళులు. అదే సమయంలో, చాలామంది తమిళులు మాత్రం, ‘మనమంతా అన్నదమ్ములం.. మనమంతా భారతీయులం. పైగా, తెలుగువారితో మాకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి.. మేం తెలుగువారిని ద్వేషించం.. కొందరు చేసే పనికి తమిళులందర్నీ అపార్థం చేసుకోవద్దు..’ అని తెలుగువారికి అండగా నిలుస్తుండడం గమనార్హం.
కొన్నాళ్ళ క్రితం ‘నారప్ప’ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో ఇలాగే పెద్ద యాగీ జరిగింది. ‘మా తమిళ హీరోలు వర్సెస్ మీ తెలుగు హీరోలు..’ అంటూ సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండింగ్‌లో పెట్టారు. నిజానికి, ఈ తరహా చెత్త ఉద్యమాలు నడిపేవారిని ఏ ప్రాంతానికి చెందినవారిగానూ చూడాల్సిన పనిలేదు. వ్యవస్థలో కొన్ని చీడపురుగులుంటాయ్.. పనీ పాటా లేకుండా చేసే వెకిలి చేష్టల్లానే వీటిని భావించాల్సి వుంటుంది తప్ప.. వీటికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఓ పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడుతోంటే.. ఈ ప్రాంతీయ పైత్యమేంటి.? పైగా, చైనా మన మీదకు దండెత్తి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మనలో మనం ఇలా ప్రాంతాల వారీగా విడిపోయి కొట్టుకోవడమా.? సిగ్గుపడాల్సిన విషయమిది.
Recent Random Post: