త్రివిక్రమ్‌తో మళ్లీ పని చేయాలనుకుంటున్న లయ!

Share


హీరో వేణుతో కలిసి కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన స్వయంవరం సినిమా ద్వారా 1999లో హీరోయిన్‌గా తెలుగు తెరపై అడుగుపెట్టిన లయ, మొదటి సినిమాతోనే హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకు కథ, మాటలు అందించిన వ్యక్తి మరెవరో కాదు – ఆ తర్వాత స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్. స్వయంవరం త్రివిక్రమ్‌కు కథా రచయితగా మొదటి సినిమా కూడా కావడం విశేషం.

ఈ సినిమా ఇచ్చిన ఊపుతో లయ టాటా బిర్లా మధ్యలో లైలా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. కానీ 2006లో వివాహం చేసుకుని అమెరికాలో సెటిలై, సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ఇప్పుడా విరామాన్ని చెరిపేస్తూ మళ్లీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది.

ఇటీవలి ఇంటర్వ్యూలో లయ 23 ఏళ్ల క్రితం తన మొదటి సినిమా అనుభవాలను గుర్తు చేసుకుంది. అప్పట్లో త్రివిక్రమ్‌ని చూసి “చదువుకున్నవాడిలా ఉన్నాడే, ఇతను సినిమాల్లోకి ఎందుకు వచ్చాడు?” అని అనుకున్నానని సరదాగా తెలిపింది. కానీ ఆ చదువుకున్న యువకుడు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయ్యాడని చెబుతూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

“త్రివిక్రమ్ రాసిన తొలి డైలాగులు పలికే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఈ రెండవ ఇన్నింగ్స్‌లో మళ్లీ ఆయనతో పని చేసే అవకాశం వస్తే, హైదరాబాదుకు తిరిగి రావడానికైనా సిద్ధంగా ఉన్నాను,” అని చెప్పిన లయ తన ఆశను బయటపెట్టింది.


Recent Random Post: