దక్షిణాది సినీ క్రమశిక్షణకు పూనమ్ థిల్లాన్ ప్రశంసలు!

Share


బాలీవుడ్ లో క్రమశిక్షణ తక్కువగా ఉంటుందని, దక్షిణాది సినీ పరిశ్రమలోని తారలు, టెక్నీషియన్లు ఎంతో క్రమశిక్షణతో పని చేస్తారని అక్కడి సినీ ప్రముఖులు తరచూ ప్రశంసిస్తుంటారు. తాజాగా, ప్రముఖ వెటరన్ నటి పూనమ్ థిల్లాన్ సైతం దక్షిణాదికి కితాబిచ్చారు.

ఒక సందర్భంలో కమల్ హాసన్ తో కలిసి ఓ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. హిందీ చిత్రసీమలో షూటింగ్‌లకు ఆలస్యంగా హాజరయ్యే అలవాటు ఉండేదని, అగ్రహీరోలైన రాజేష్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా వంటి వారు సైతం సెట్స్‌కి ఆలస్యంగా వచ్చేవారని తెలిపారు. వారిని అనుసరించడంతో, తానూ అదే విధంగా వ్యవహరించానని చెప్పారు. అయితే అదే అలవాటుతో దక్షిణాదిలో షూటింగ్‌కి ఆలస్యంగా వెళ్లినప్పుడు, కమల్ హాసన్ తనను గట్టిగా మందలించారని ఆమె వెల్లడించారు.

“ఒకసారి షూటింగ్ కోసం ఉదయం 7 గంటలకు హాజరుకావాల్సి ఉండగా, నేను 8 గంటలకు వచ్చాను. నేను ఆలస్యమైపోయానని అనుకోలేదు, కానీ కమల్ గారు పక్కకు తీసుకెళ్లి గట్టిగా తిట్టారు. అక్కడ ఉన్న టెక్నీషియన్లు, లైట్‌మెన్, కెమెరామెన్లు అందరూ చాలా ముందే వచ్చేశారు. వాళ్లు దూరం నుంచి రావడంతో ఉదయం 5 గంటలకే లేచివచ్చి పని చేస్తున్నారు. నేను మాత్రం గంట ఆలస్యంగా వచ్చాను. కమల్ గారు చెప్పిన మాటలు నాకు ఒక మేల్కొలుపు లాంటి అనుభూతినిచ్చాయి,” అని పూనమ్ థిల్లాన్ చెప్పారు.

కమల్ హాసన్ ఎంత పెద్ద స్టార్ అయినా, సెట్స్‌కి ఆలస్యంగా రావడం లేదని, అలా ఆయన పనిచేసే తీరు చూసి ఆశ్చర్యపోయానని ఆమె అన్నారు. అలాగే, దక్షిణాదిలో టెక్నీషియన్లను ఎంతో గౌరవిస్తారని, సెట్లో అందరూ పరస్పర గౌరవంతో ఉంటారని పేర్కొన్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో పని చేసిన అనుభవం తనకు ఎంతో గొప్ప పాఠం నేర్పిందని, అక్కడ శ్రమజీవులను గౌరవించే విధానం చూసి ముచ్చటేసిందని పూనమ్ థిల్లాన్ తెలిపారు. “సాయంత్రం టిఫిన్ సమయంలో కూడా స్టార్లు, టెక్నీషియన్లు అందరూ కలిసి తినడం చూసి ఆశ్చర్యపోయాను. ఇడ్లీ, వడ, ఉత్తపం వంటివి అందరికీ వడ్డిస్తారు. ఇది టెక్నీషియన్లను గౌరవించే గొప్ప సంస్కృతి,” అని ఆమె పేర్కొన్నారు.

ఈ అనుభవం తన కెరీర్‌లో ఒక మార్గదర్శకంగా నిలిచిందని పూనమ్ థిల్లాన్ అన్నారు.


Recent Random Post: